iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఫ్లాపులతో సతమవుతున్న తన మిత్రుడి కోసం తమిళ బ్లాక్ బస్టర్ నాట్టమై హక్కులు కొనిపించి మరీ పెదరాయుడు రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కేందుకు రజని ఎంత కృషి చేశారో అందులో పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్ సాక్షిగా ఎవరూ మర్చిపోలేరు. అయితే దీనికన్నా ముందు ఈ ఇద్దరూ ఒకే కథతో చెరో భాషలో సినిమా చేసి సూపర్ హిట్ అందుకోవడం అంటే విశేషమేగా. అందులోనూ ఫలితం కూడా ఒకేలా దక్కడం అరుదనే చెప్పాలి. ఇండస్ట్రీ ఫ్రెండ్ షిప్ లోనూ వీళ్ళ ప్రయాణం అలా సాగిందన్న మాట.
1992 సంవత్సరం. అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం హ్యాట్రిక్ హిట్లతో సోలో హీరోగా మోహన్ బాబు మార్కెట్ ఓ రేంజ్ లో ఉంది. అప్పుడు చేసిందే అల్లరి మొగుడు. రమ్యకృష్ణ, మీనా హీరోయిన్లుగా ఇద్దరు భార్యల కాన్సెప్ట్ కి ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంటర్ టైనింగ్ గా రచయిత సత్యానంద్ తో స్క్రిప్ట్ ని తయారుచేయించి స్వంత బ్యానర్ లో స్వీయ దర్శకత్వంలో నిర్మించారు కె రాఘవేంద్రరావు. ఎంఎం కీరవాణి పాటలు సినిమా విడుదలకు ముందే ప్లాటినం డిస్క్ సాధించే స్థాయిలో మారుమ్రోగిపోయాయి. ప్రేమికుల రోజు కానుకగా రిలీజైన అల్లరి మొగుడు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఏకధాటిగా వందరోజులు ఆడేసింది.
దీన్ని తమిళ్ లో నువ్వు చేస్తే బాగుంటుందని మోహన్ బాబు సూచించడంతో రజినీకాంత్ దర్శకుడు సురేష్ కృష్ణకు ఆ బాధ్యతను అప్పగించారు. ఒరిజినల్ వెర్షన్ లో మీనాను మాత్రమే తీసుకుని మిగిలిన క్యాస్టింగ్ ని మార్చేశారు. రమ్యకృష్ణ స్థానంలో రోజా వచ్చింది. టైటిల్ వీరగా నిర్ణయించారు. సంగీతం కోసం ఇళయరాజాను ఒప్పించారు. తెలుగు పాటలు వినకుండా రాజా ప్రత్యేకంగా తనదైన బాణీలో కొత్త స్వరాలు సమకూర్చారు. అరవంలోనూ వీర మ్యూజికల్ గా సంచలనం సృష్టించింది. . ఇక్కడ ఏదైతే ఫలితం దక్కిందో తమిళ్ లోనూ వీరా అదే అందుకుంది. కొంత కాలం తర్వాత మళ్ళీ దీన్ని తెలుగు ప్రేక్షకుల కోసం అదే టైటిల్ తో డబ్బింగ్ చేయడం ఫైనల్ ట్విస్ట్