iDreamPost
android-app
ios-app

టీడీపీకి ఫ్రైడే టెన్షన్, ఈరోజు ఎవరి వంతు వచ్చేనో?

  • Published Jul 16, 2020 | 7:32 PM Updated Updated Jul 16, 2020 | 7:32 PM
టీడీపీకి ఫ్రైడే టెన్షన్, ఈరోజు ఎవరి వంతు వచ్చేనో?

తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. శుక్రవారం వస్తే చాలు తీవ్ర ఒత్తిడి తప్పడం లేదు. టెన్షన్ తో తల్లడిల్లిపోవాల్సి వస్తోంది. ఎటు నుంచి ఏ కేసు వచ్చేనో అన్నది తెలియక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఈసారి ఏ నాయకుడి వంతు అన్నది అంతుబట్టక అల్లాడిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక నేతలు కటకటాల వెనక్కి వెళ్లారు. అందులో అచ్చెన్నాయుడు ఆధారాలతో అవినీతి కేసులో ఇరుక్కోగా, హత్య కేసులో కొల్లి రవీంద్ర సెంట్రల్ జైలు పాలయ్యారు. వారితో పాటుగా ఇంకా అనేక మంది ఛోటా మోటా నేతలు కూడా వివిధ కేసుల్లో ఇరుక్కుని ఇక్కట్లు పాలవుతున్నారు. ఇక అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర అరెస్ట్ కూడా శుక్రవారం నాడే జరగడం విశేషంగా మారిన నేపథ్యంలో మళ్లీ శుక్రవారం రాగానే తెలుగుదేశం నేతలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందనే వాదన మొదలయ్యింది.

తొలుత జూన్ 12న మాజీ మంత్రి అచెన్నాయుడుని ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లి నిమ్మాడ నుంచి విజయవాడ కి తరలించారు. ఆతర్వాత ఆయన బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పైగా ఈ కేసులో ఆధారాలున్నాయనే రీతిలో తాజాగా ముందస్తు బెయిల్ కోసం మరో మాజీ మంత్రి పితాని సత్యన్నారాయణ తనయుడి పిటీషన్ లో జడ్జీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారబోతున్నాయి. ఇక ఆ తర్వాత జూలై 3న శుక్రవారం నాడే కొల్లి రవీంద్రని కూడా అరెస్ట్ చేశారు. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత హత్య కేసులో తప్పించుకునే ప్రయత్నంలో తుని వరకూ వెళ్లిన రవీంద్రను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దాంతో ఈ ఇద్దరు నేతల అరెస్ట్ శుక్రవారం రోజునే జరగడం టీడీపీ నేతల్లో కలవరం కలిగించేందుకు దోహదం చేసింది.

తాజాగా సైకిళ్ల కుంభకోణం తెరమీదకు వచ్చింది. టీడీపీ అధికారంలో ఉండగా విద్యాశాఖలో పాఠశాల విద్యార్థినులకు ఉచితంగా పంపిణీ చేసిన సైకిళ్ల కొనుగోళ్లలో 5 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.12 కోట్ల మేర కొనుగోళ్లలో రూ.5 కోట్లు అవినీతి అంటే చాలా పెద్దమొత్తంగానే భావించాలి. ఎస్ కే బైక్స్ వంటి బ్యాన్ చేసిన సంస్థల నుంచి సైకిల్స్ కొనుగోళ్ల వెనుక నాటి విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన అరెస్ట్ ఖాయమని ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన బలంగా చెబుతున్న మాటలతో గంటా శిబిరంలో కలకలం కనిపిస్తోంది.

అదే సమయంలో పితాని సత్యన్నారాయణ తనయుడి అరెస్ట్ కి అంతా సిద్ధమయ్యిందనే ప్రచారం కూడా ఊపందుకుంది. పితాని వెంకట సురేష్ అప్పట్లో తన తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అవినీతికి పాత్రధారుడిగా ఏసీబీ పేర్కొంది. దాంతో తన అరెస్ట్ నుంచి మినహాయించాలని ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ మొండిచేయి తప్పలేదు. పైగా కేసులో అరెస్ట్ కి అన్ని ఆధారాలున్నాయనే రీతిలో వ్యాఖ్యలు వినిపించాయి. ఈ తరుణంలో పితాని తనయుడికి ఈ శుక్రవారం ముహూర్తం ఖాయమనే వారి సంఖ్య పెరుగుతోంది.

ఇక నీటిపారదుల, పౌరసరఫరాలు సహా వివిధ కేసులలో ఆనాటి మంత్రులు, వారి అనుచరుల సహా అనేక మంది పేర్లు ప్రస్తావనలో ఉన్న సమయంలో ఎవరికి, ఏ కేసుతో ఇబ్బంది తలెత్తుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది. టీడీపీ నేతలు తలలు పట్టుకుంటూ తాజాగా రాష్ట్రపతి వరకూ వెళ్ళారు. ఇద్దరు మాజీ మంత్రుల అరెస్ట్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆశించిన ఫలితం దక్కుతుందా అంటే అవకాశం చాలా నామమాత్రం. దాంతో ఈ శుక్రవారం నాడు పోలీసులు ఏ తెలుగుదేశం నేత ఇంటి తలుపు తడుతారన్నదే ఆసక్తికరం.