ఏపీ మాజీ దేవదాయశాఖామంత్రి , భాజపా సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు(59) గారు కరోనాతో తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరులోని కొవిడ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారం క్రితమే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు.
2014లో టీడీపీతో పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నుండీ భాజపా తరపున MLA పోటీ చేసి గెలిచిన మాణిక్యాలరావుగారు గత టీడీపీ ప్రభుత్వంలో 2014-2018 మధ్యకాలంలో దేవదాయశాఖామంత్రిగా పనిచేశారు. చాలా మంచి వ్యక్తిగా, ముక్కుసూటి మనిషిగా,సౌమ్యుడిగా పేరుపొందిన మాణిక్యాలరావుగారు అకాల మరణంతో అనేకమంది దిగ్భ్రాంతికి గురయ్యారు..పలువురు నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని జగన్ పేర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.