అనగనగా ఒక నది, ఆ నది మీద తేలియాడే ఒక నగరం.. ఆ నగరం ఒక స్వర్గానికి కేరాఫ్ లా ఎలాంటి చీకూ చింతా లేకుండా ఉండేది. అలాంటి నగరం ఒక్కసారిగా మాయం అయింది. ఇదంతా ఏదో కథ అనుకుంటున్నారా? నిజమేనండీ బాబోయ్..
అసలు విషయంలోకి వెళితే కోట్లాది రూపాయల బంగారు నిధి ఉందని భావిస్తున్న ఒక పురాతన దీవి ఇండోనేషియాలో కనుగొనబడింది. ‘బంగారు ద్వీపం’ అని పిలువబడే ఈ దీవి ఇండోనేషియా దేశంలోని సుమత్రా దీవుల దగ్గరలో కనుగొనబడింది. గత 5 సంవత్సరాలుగా, కొందరు మత్స్యకారులు పాలెంబాంగ్ సమీపంలోని ముసళ్ళతో నిండిన మూసీ నదిలో ఈ దీవి కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించి ఓ మత్స్యకారుడికి నది లోతుల్లోంచి వెలకట్టలేని ఒక బంగారు నిధి దొరికింది. ఆ నిధిలో బంగారు ఉంగరం, నాణేలు అలాగే ఒక అత్యద్భుతమైన బుద్ధుని విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహం 8వ శతాబ్దానికి చెందినదని, దీని విలువ కోటి రూపాయల దాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ విగ్రహం మీద అనేక విలువైన రాళ్లు కూడా పొడగబడ్డాయి, ఆ రాళ్ల కారణంగా బుద్ధుని విగ్రహం ధర చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ నిధి లక్షల కోట్ల నిధికి దారి అని అంటున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మత్స్యకారులకు దొరికిన అన్ని కళాఖండాలు శ్రీవిజయ నాగరికతకు చెందినవట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రాజ్యానికి భారతదేశంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సామ్రాజ్యం 7వ నుండి 13వ శతాబ్దానికి మధ్య ఉండేదని, ఈ సామ్రాజ్యం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడిందని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఒక శతాబ్దం తర్వాత ఈ సామ్రాజ్యం రహస్యంగా అదృశ్యమైంది. ఆ తరువాత శ్రీ విజయ సామ్రాజ్యాన్ని కనుగొనడానికి చాలా మంది థాయిలాండ్ నుండి భారతదేశం వరకు శోధించారని బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ సీన్ కింగ్స్లీ డైలీమెయిల్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే శిథిలమైన రాజ్యం ఉందని భావిస్తున్న, పరిగణించబడుతున్న పాలెంబాంగ్ నుండి కూడా పురావస్తు శాస్త్రవేత్తలు తగినంత పురాతన వస్తువులు సేకరించలేక పోయారని ఆయన అన్నారు. భూమిపై ఉన్న ఈ చివరి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం తన రహస్యాలను పూర్తిగా దాచిపెట్టిందని డాక్టర్ సీన్ చెప్పారు. ఈ సామ్రాజ్య రాజధానిలో 20 వేల మంది సైనికులు నివసించారని, వెయ్యి మంది బౌద్ధ సన్యాసులు కూడా అక్కడ నివసించారని ఆయన చెబుతున్నారు.
డాక్టర్ సీన్ చెబుతున్న దాని ప్రకారం, గత 5 సంవత్సరాల నుండి అనేక అసాధారణమైన విషయాలు జరుగుతున్నాయి. అన్ని కాలాలకు చెందిన నాణేలు, బంగారం, బుద్ధ విగ్రహాలు, వెలకట్టలేని రత్నాలు మొదలైనవి కనుగొనబడుతున్నాయి. ప్రాచీన కాలంలో సుమత్రాను ‘బంగారు ద్వీపం’ అని పిలిచేవారు. దీనికి కారణం ఇక్కడ బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉండేవట. అలాగే ఇది ఆగ్నేయాసియాలో వాణిజ్యానికి ప్రారంభ స్థానం అని కూడా అంటున్నారు. 6వ మరియు 7వ శతాబ్దాలలో, ఆసియా సముద్ర వాణిజ్యం వృద్ధి చెంది, చైనీస్ మార్కెట్ ప్రారంభమైంది. బౌద్ధ సంప్రదాయానికి అధిక డిమాండ్ కారణంగా, చైనా ఇండోనేషియా నుంచి పెద్ద మొత్తంలో ఎగుమతి చేయడం ప్రారంభించిందని అంచనా. మత్స్యకారులకు నదీ గర్భంలో బంగారం మరియు రత్నాలు కనుగొనడమే కాకుండా, అనేక టన్నుల చైనా పురాతన నాణేలు కనుగొనబడినట్లు డాక్టర్ సీన్ చెప్పారు. ఇవి కాకుండా, మునిగిపోయిన ఓడల నుండి చాలా పింగాణీ పాత్రలు కనుగొనబడ్డాయి. శ్రీవిజయ రాజ్యంలో భారతదేశం మరియు పర్షియా నుండి వస్తువులు దిగుమతి అయ్యేవని అంటున్నారు.
శ్రీ విజయుల కాలంలో దేవాలయాలు కంచుతో, వాటి లోపల బౌద్ధ విగ్రహాలు బంగారంతో ఉండేవట. రాహువు యొక్క మొండెం వారి తలుపులపై అమర్చబడి ఉందని కూడా కనుగొన్నారు. కత్తిపై బంగారు హ్యాండిల్స్, వందలాది బంగారు ఉంగరాలు, చిహ్నాలు, బంగారు హారాలు మొదలైనవి ఆ ప్రదేశంలోనే కనుగొనబడ్డాయి. ఈ అద్భుతమైన రాజ్యం నీటిపై ఉండేదని, నదే అప్పటి ప్రజల నివాసమని డాక్టర్ సీన్ చెప్పారు. 14వ శతాబ్దంలో ఈ నాగరికత అంతరించిందన్నారు సీన్. చెక్కతో చేసిన ఇళ్లు, రాజభవనాలు, దేవాలయాలు అన్నీ నదిలో మునిగిపోయాయని, అయితే ఈ రాజ్యం యొక్క జనాభా ఎంత, అనేది ఇంకా లెక్కలు తేలలేదని వెల్లడించారు.
శ్రీ విజయ సామ్రాజ్యం ఎలా అంతమైంది అనేది ఇప్పటికీ ప్రపంచానికి మిస్టరీగా మిగిలిపోయింది. యూరప్‌లోని పాంపీ ఎలా అయితే అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా మాయం అయిందో, శ్రీ విజయ సామ్రాజ్యం కూడా అలాగే అంతం అయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదని డాక్టర్ సీన్ అన్నారు. నదిలో తీవ్రమైన వరదల కారణంగా ఈ సామ్రాజ్యం అంతం అయి ఉండవచ్చని కూడా ఆయన అన్నారు. ఇప్పటివరకు, నదిలో అనేక సార్లు డైవింగ్ చేసినప్పటికీ, అనేక ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరక లేదని, ఈ నది నుండి లభించిన కళాఖండాలను స్థానిక వ్యాపారులకు విక్రయించడం వలన వాటిని సరిగ్గా పరిశీలించే అవకాశం దొరకడం లేదని అన్నారు. ఈ కళాఖండాలు ఇప్పుడు కనుమరుగైపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని డాక్టర్ సీన్ చెప్పారు.