విశాఖ జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలోని సోమాంబిక దేవాలయం సమీప జాతీయ రహదారిలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేపలు లోడుతో వెళుతున్న వ్యాను బోల్తా పడి భారీగా నష్టం జరిగింది.
కాకినాడ నుండి ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న వ్యాను కూడలి వద్ద ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది.
దీంతో వ్యాను బోల్తా పడింది. వెన్నెల్లో ఉన్న చేపలన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో కారు చక్రం విరిగిపోయి వెనుకభాగం నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
చేపల లోడుతో వెళుతున్న వ్యాను బోల్తా పడినట్టు సమాచారం తెలిసిన స్థానికులు, జాతీయ రహదారిపై వెళ్లే వాహనచోదకులు ‘ భలే చాన్సులే.. దొరికినంత దోచుకో ‘ అన్నట్టు ఎవరికి అందిన చేపలను వారు పట్టుకెళ్ళి పోయారు.
దీంతో గంటలకొద్దీ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ ఎల్ హిమగిరి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జనాన్ని అదుపు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించే ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.