iDreamPost
android-app
ios-app

థియేటర్ల తెరిచివేతకు మొదటి అడుగు

  • Published Sep 28, 2020 | 7:27 AM Updated Updated Sep 28, 2020 | 7:27 AM
థియేటర్ల తెరిచివేతకు మొదటి అడుగు

ఇప్పటికే ఆరు నెలలుకు పైగా మూతబడిన థియేటర్లను తెరవొచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేయడం సినిమా వర్గాలను ఆనందానికి గురి చేసింది. సదరు ఆదేశాలు ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తించినప్పటికీ మిగిలినవాళ్ళు కూడా అదే రూట్ ఫాలో కాకపోతారా అనే ఆశాభావం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంగానే ఇంకో వారం రోజులో నిర్ణయాలు తీసుకోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే మమతా అనుమతి ఇస్తున్నామని చెప్పినప్పటికీ కేవలం 50% ఆక్యుపెన్సి మాత్రమే అని స్పష్టం చేశారు. అంటే సగం సీట్లు ఖాళీగా వదిలేయాలి. 

ఇది ముందు నుంచి అనుకున్నదే కానీ వైరస్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇందులో ఏదైనా సడలింపు ఉండకపోదా అని ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కేంద్రం గైడ్ లైన్స్ కు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో చాలా అధిక స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని థియేటర్లు నడపాల్సి ఉంటుంది. సింగల్ స్క్రీన్లకే ఇది ఆర్ధికంగా భారంగా మారుతుంది. అయితే కొంత కాలం నష్టాలు భరించక తప్పదు. సంక్రాంతికంతా పరిస్థితి సద్దుమణిగి జనం ఎప్పటిలాగే హాళ్లకు రావాలంటే ఇప్పటి నుంచే దానికి సంసిద్ధం కావాలి. ఇప్పటికే తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇంకొన్ని త్యాగాలు తప్పవు. అయితే ముందు కొత్త సినిమాలు ఏవి రిలీజవుతాయన్నదే భేతాళ ప్రశ్న. ఉప్పెన, రెడ్ లాంటి లాంటి క్రేజీ మూవీస్ వచ్చే జనవరినే టార్గెట్ చేసుకున్నాయి. 
ఒకవేళ నవంబర్ లో అంతా అనుకూలంగా మారుతున్నట్టు అనిపిస్తే డిసెంబర్ క్రిస్మస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది జరగాలంటే అంత సులభం కాదు. జనం ఎప్పటిలాగే బయట తిరుగుతున్నారు కానీ రెండున్నర గంటలు నిర్భయంగా థియేటర్లకు వచ్చి కూర్చుంటారా అనేదే అసలు ఛాలెంజ్. సినిమాల అభిమానులు వచ్చినా హౌస్ ఫుల్ చేయడనికి వాళ్ళు సరిపోరు. సామాన్యులు కూడా రావాలి. అప్పుడు కానీ మునుపటి కళ రాదు. ఏదైతేనేం మొత్తానికి ఒక సైడ్ నుంచి ముందడుగు పడుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలినవాళ్లు కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే ఎంతో కొంత కదలిక వస్తుంది. ఎన్నడూ లేనంతగా ఏకంగా ఇన్నేసి నెలల పాటు థియేటర్లు మూతబడి ఉండటం చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఇకపై చూడాలని కూడా ఎవరూ కోరుకోవడం లేదు. ఇదే మొదటిసారి. ఆఖరుసారి కావాలని ప్రతిఒక్కరి కోరిక