హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన కోఠి చౌరస్తాలోని ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న షాపుల సముదాయంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల 45నిమిషాల సమయంలో బట్టషాపుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో 8 బట్టల షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది కానీ కోట్ల రూపాయల బట్టలు పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యాయి. ప్రమాదం కారణంగా భారీగా మంటలు ఎగసిపడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు కళ్ళముందే వస్త్ర దుకాణాలు దగ్ధం అవుతుండడంతో దుకాణాల్లోకి వెళ్లి బట్టలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి నాలుగు ఫైరింజన్లతో చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా మంటలు అదుపులోకి రాలేదు.
అగ్నిప్రమాదంలో న్యూ లార్డ్స్, సందీప్ ఖురానా, హర్యానా హ్యాండ్లూమ్స్, సతీష్ చంద్ జైస్వాల్, హర్యానా హ్యాండ్లూమ్స్, భవానీ ఫ్యాషన్ వేర్ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేక ఇతర కారణాల వల్ల మంటలు వ్యాపించాయా అన్న కోణంలో పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా రూ.లక్షలు వెచ్చించి ఇటీవలే బట్టలు తీసుకువచ్చామని అగ్నిప్రమాదం కారణంగా సర్వం కోల్పోయామని దుకాణ యజమానులు విలపించారు. వస్త్ర దుకాణాలున్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ కేసు వేశారని కోర్టులో వివాదం నడుస్తోందని వాళ్లే ఈ పని చేసి ఉండొచ్చని దుకాణ యజమానులు ఆరోపించారు. కాగా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.