Idream media
Idream media
చట్టం తన పని తాను చేసుకుపోతుందని పలు సందర్భాల్లో రాజకీయ నేతలు చెప్పే మాట. రాజకీయ నాయకుల విషయాల్లో చట్టం ఎలా పనిచేస్తుందన్న విషయం పక్కనపెడితే.. ఆ చట్టాన్ని అమలు చేసే పోలీసులపై మాత్రం పక్కాగా అమలు అవుతోంది. చట్టం అమలు చేసేది ఖాకీలైనా.. వారు తప్పు చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతోంది.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటున్నా కొంత మంది పోలీసులు తమకు అలవాటైన రీతిలోనే ప్రజల పట్ల ప్రవర్తిస్తున్నారు. తరచూ పోలీసు పెద్దలు క్లాస్ పీకుతున్నా.. అప్పుడప్పుడు టెంప్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా బలంగా ఉండడంతో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రిపోర్టర్ అవతారం ఎత్తుతున్నారు. ఖాకీల దురుసు ప్రవర్తనను వారికి తెలియకుండానే వీడియో తీసి నెట్టింట్లో పెడుతున్నారు. సోషల్ మీడియాలో తమ దూకుడు వ్యవహారం చూసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. చేతులు కాలాక ఆకుల పట్టుకున్నా లాభం లేదనుకుని తాను పని చేసిన స్టేషన్‌లోనే తనపైనే ఎఫ్‌ఐఆర్ పడినా ఏమీ చేయలేని స్థితిలో కొంత మంది పోలీసులున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం, పేకాట, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అయితే నిందితుల పట్ల చట్ట పరిధిలో వ్యవహరించాల్సిన ఖాకీలు యథావిధిగా తమ ప్రతాపం చూపుతున్నారు. అసాంఘిక పనులకు పాల్పడే వారితోపాటు.. సాధారణ ప్రజలపై కూడా పలు సందర్భాల్లో విచక్షణ కోల్పోయి ప్రవర్తించడంతో ఏపీలో ఇప్పటి వరకూ 53 మంది పోలీసులపై ఎఫ్‌ఐఆర్ పడింది.
చీరాల, సీతానగరం ఘటనలతో పోలీస్ భాస్ గౌతం సవాగ్ మరోసారి తన సిబ్బందికి ప్రభుత్వం విధానాన్ని చెప్పి క్లాస్ పీకారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డు నుంచి ఎస్పీ వరకూ అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో దిశానిర్థేశం చేశారు. దిశ తప్పితే.. దశ ఎలా తిరుగుతుందో కూడా ఇప్పటి వరకూ దశ తప్పిన పోలీసులపై తీసుకున్న చర్యలు, నమోదైన కేసులను గుర్తు చేశారు. టెంప్ట్ అవ్వొద్దని మరీ నొక్కి చెప్పారు. సొంత సిబ్బందిపై కేసులు పెట్టడం బాధాకరమైనా తప్పడం లేదని.. తప్పు చేస్తే శిక్ష తప్పదని సుతిమెత్తగా హెచ్చరించారు. మరి ఇకపైనైనా పోలీసుల తీరు మారుతుందో లేదా చూడాలి.