Idream media
Idream media
బిహార్ ఎన్నికలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల నమ్మకానికి ఓ గుర్తింపుగా మారనున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. తుది దశ పోలింగ్ నేడు జరగనుంది. మొత్తం 78 స్థానాలలో ఓటర్లు తుది తీర్పు ఇవ్వనున్నారు. ఎన్నికల ప్రచారంలో అగ్ర నేతలందరూ రంగంలోకి దిగారు. ఎన్‌డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ సభలలో పాల్గొన్నారు. మారుమూల జిల్లాలలో కూడా పర్యటించారు. మొత్తం 12 ఎన్నికల సభలలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌డీఏ కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, జెపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్‌లు కూడా నితీశ్ ను గెలిపించాలని ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక మహాగడ్బంధన్ తరఫున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాధేపుర, అరారియా జిల్లాలలో జరిగిన ఎన్నికల సభలలో పాల్గొన్నారు.
నిలుపుకుంటారా..? చేజిక్కించుకుంటారా..?
అధికారం నిలుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ధ్యేయంతో తేజస్వీ యాదవ్ ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. ఇవే నితీశ్ చివరి ఎన్నికలంటూ తేజస్వీ విమర్శనాత్మకంగా, ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓటర్ల సానుభూతి పొందేలా నితీశ్ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ సభలకు కూడా కొన్ని చోట్ల జన స్పందన బాగానే ఉంది. ఇది ఇటు ఎన్‌డీఎ, అటు మహాగడ్బంధన్‌లకు గుబులుగానే ఉంది. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందో తెలియడం లేదు. ఇక ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే సీమాంచల్‌లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేశారు. ఎవరికి వారే ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధానంగా నితీశ్, తేజస్వీ మధ్య మాటల యుద్ధం నడిచింది.
సర్వేలు ఏం చెప్పాయంటే…
దేశం మొత్తం బిహార్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా కొన్ని సర్వేలు ముందస్తుగానే ఫలితాలను అంచనా వేశాయి. బీహార్‌లో జేడీయూ-బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ 133 నుంచి 143 స్థానాలతో అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే తేల్చి చెప్పింది. 243 స్థానాలున్న బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమికి 88 నుంచి 98 వరకూ స్థానాలు దక్కవచ్చని సర్వే తెలిపింది. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు సారథ్యం వహిస్తోన్న లోక్ జనశక్తి పార్టీకి రెండు నుంచి ఆరు స్థానాల్లో విజయం లభించవచ్చని, ఇతరులు ఆరు నుంచి పది స్థానాల్లో గెలవవచ్చని సర్వే అంచనా వేసింది. ఎన్డీఏకు 38 శాతం, మహాకూటమికి 32 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా. ఎల్‌జేపీకి ఆరు శాతం ఓట్లు దక్కుతాయని ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
ఇటు అధికార ఎన్డీఏ, అటు విపక్ష యూపీఏ కూటములు హోరాహోరీగా తలపడగా.. ఎల్జేపీ, ఎన్సీపీ సహా పలు పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మొదటి దశ అక్టోబరు 28న, రెండోదశ నవంబరు 3న పోలింగ్ పూర్తయింది. నేడు జరగబోయే చివరి దశలో పోలింగ్ పై అంతటా ఆసక్తి ఏర్పడింది. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.