iDreamPost
android-app
ios-app

సం‘గ్రామం’ ముగిసింది

సం‘గ్రామం’ ముగిసింది

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు ముగిసింది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఈ రోజు ముగిశాయి. చివరిదైన నాలుగో విడత పోలింగ్‌ ఈ రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా తుది విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. నాలుగో విడతలోనూ ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు. వార్డుల వారీగా బూత్‌లు ఏర్పాటు చేయడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ ఏర్పడడం లేదు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి దాదాపు 78.90 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించనున్నారు.

తుది విడతలో 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలోని 161 మండలాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 3,299 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా 554 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 2,743 పంచాయతీలలో పోటి నెలకొంది. 7,475 మంది సర్పంచ్‌ పదవికి పోటీ ఉన్నారు. 33,435 వార్డులకు గాను 10, 921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 91 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 22, 514 వార్డులకు పోలింగ్‌ జరుగుతుండగా 52,700 మంది బరిలో నిలిచారు. ఈ దశలో ఏ పార్టీ మద్ధతుదారులు ఎన్ని స్థానాల్లో గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తొలి విడతలో 3,249 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2,640 స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 510 పంచాయతీలను గెలుచుకున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 96 పంచాయతీలలో గెలుపొందారు. మరో మూడు పంచాయతీలకు ఎన్నికలు వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి.

రెండో విడతలో 3,328 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో వైసీపీ మద్ధతుదారులు 2,649 స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థులు 538 పంచాయతీలను గెలుచుకున్నారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 138 స్థానాల్లో గెలుపొందారు. ఈ దశలోనూ మూడు పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు.

మూడో విడత ఎన్నికలకు ఈ నెల 17వ తేదీన జరిగాయి. 3,221 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వివిధ కారణాలతో మూడు పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ఏకగ్రీవమైన స్థానాలతోపాటు వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 2,580 స్థానాలను గెలుచుకున్నారు. టీడీపీ మద్ధతుదారులు 527 పంచాయతీల్లో గెలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 108 స్థానాల్లో విజయం సాధించారు.

మొత్తంగా మూడు దశల్లో 9,795 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ బలపర్చిన అభ్యర్థులు 7,869 పంచాయతీల్లో జయకేతనం ఎగురవేశారు. టీడీపీ మద్ధతుదారులు 1,575 స్థానాల్లోనూ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 342 పంచాయతీలను గెలుచుకున్నారు.