Idream media
Idream media
మోసగాళ్లకు మోసగాడు సినిమా వచ్చి 49 ఏళ్లు దాటి 50లోకి పడింది. 1971 ఆగస్టు 27న విడుదలైంది. అదే ఏడాది దసరా సెలవుల్లో ఈ సినిమా చూశాను. నా వయస్సు 8 ఏళ్లు. ఇంట్లో వాళ్లు తోడు లేకుండా నేను చూసిన మొదటి సినిమా. నా కంటే పెద్దవాళ్లు కొందరు ( వాళ్ల వయస్సు 14) ఈ సినిమా మ్యాట్నీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. అది కనిపెట్టి నేను వెంటపడితే రహస్యం బట్టబయలు కాకుండా ఉండడానికి తీసుకెళ్లారు.
నేల క్లాస్‌లో కూచున్నా. ఒకటే జనం. కృష్ణ కనిపిస్తే ఈలలు. ఊపిరి ఆడని ఆ వాతావరణంలో కూడా ఆ సినిమా నన్ను వేరే లోకాలకి తీసుకెళ్లింది. రాయదుర్గం ప్యాలెస్ టాకీస్‌లో చూసిన మరపురాని సినిమాల్లో అదొకటి.
50 ఏళ్లలో కనీసం 50 సార్లు చూసి ఉంటాను. ఈ రోజు కూడా చూశాను. కాలం సినిమాల్ని మారుస్తుంది. మనల్ని మారుస్తుంది. ఇప్పుడీ సినిమా చాలా నసగా ఉండాలి, బోర్ కొట్టాలి. కానీ ప్రెష్‌గా ఉంది. మంచి సినిమాలు, గొప్ప సినిమాల లక్షణం ఇది.
కృష్ణ సొంత సినిమాలు తీయాలని పద్మాలయా ప్రారంభించాడు. అగ్ని పరీక్ష తీస్తే అది ఆడలేదు. హాలీవుడ్‌లో కౌబాయ్‌ల కాలం నడుస్తోంది. అవన్నీ మద్రాస్‌లో ఆడేవి (విచిత్రం ఏమంటే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మద్రాస్‌లో ఉన్నా, ఆ రోజుల్లో తెలుగు సినిమాలు తక్కువగా ఆడేవి). మెకన్నాస్ గోల్డ్ , గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, ప్యూడలర్స్ మోర్ ఇవన్నీ కృష్ణకి నచ్చాయి. క్రైమ్ సినిమా రచన ఆరుద్ర ఎంత బాగా చేశారంటే సగం విజయం అక్కడే లభించింది. సినిమాలోని అన్ని సీన్లు ఇంగ్లీష్ సినిమాల్లోంచి కొట్టేసినవే అయినా , నేటివిటీకి కథని కనెక్ట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
ఈ సినిమా హిట్ తర్వాత వచ్చిన అనేక కౌబాయ్ సినిమాలు ఆడకపోవడానికి కారణం కథలో నేటివిటీ లేకపోవడమే. ఇప్పుడు ఆలోచిస్తే ఈ కథలోని కామెడీ ఏమంటే నిధికి దారి తెలియకుండా తాళాల కోసం వెతకడం ఎంత మూర్ఖత్వమో, దారి తెలిసిన వాళ్లు తాళాల కోసం వెతకడం అంతే మూర్ఖత్వం. ఎంత తాళమైనా ఒక బండరాయితో కొడితే పోతుంది కదా. అయినా ఆ గుహలోకి ఒక కార్పెంటర్‌ని తీసుకుపోయి తలుపులు ఎట్లా చేయించి ఉంటారో! మొత్తం ఇంగ్లీష్ సినిమాల సీన్స్‌తో కథ తయారు చేసి దీన్ని ఇంగ్లీష్‌లోకి డబ్ చేశారు. ఇదీ విచిత్రం.
షూటింగ్ కోసం కృష్ణ ఎంత రిస్క్ తీసుకున్నాడంటే అప్పటి వరకూ ఎవరూ చూపించని రాజస్థాన్ ఎడారి, సిమ్లా మంచుకొండలు, సట్లేజ్ నదీ ప్రాంతాల్ని కలర్‌లో చూపించాడు. మద్రాస్ నుంచి జైపూర్‌కి ప్రత్యేక రైళ్లో యూనిట్‌ని తీసుకెళ్లాడు.
నిధి వేట ప్రధాన కథ అయినప్పటికీ నాగభూషణం నక్కజిత్తులు, విజయనిర్మల పగ, జ్యోతిలక్ష్మి ఎపిసోడ్ ఇవన్నీ ఉపకథలు. అన్నీ మెయిన్ స్టోరీకి ఇంటర్వెల్ టైంకి కనెక్ట్ అవుతాయి. నాగభూషణం పాత్రకి ది గుడ్, ది బ్యాడ్, ది అగ్లీ సినిమాలో ఈలీవాలెచ్ వేసిన టుకో క్యారెక్టర్ ప్రేరణ. ప్రత్యేకంగా కామెడీ పాత్ర లేకపోవడం వల్ల నాగభూషణం డైలాగ్‌లతోనే ఆరుద్ర కామెడీ పండించాడు.
ఆదినారాయణరావు సంగీతం కాపీలా అనిపిస్తుంది కానీ అది ఒరిజనల్. అన్ని పాటలు బావుండడమే కాదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంది. రాజసులోచన తన సినీ కెరీర్‌లో చేసిన చెత్త డ్యాన్స్ ఇది. అంత మంచి నటి , అలా సగం బట్టలతో డ్యాన్స్ చేయడం ఆ రోజుల్లో అభిమానుల్ని బాధ పెట్టింది.
అయితే షూటింగ్‌కు వెళ్లే వరకు తన డ్రెస్ ఆ విధంగా ఉన్నట్టు తెలియదని, తాను అభ్యంతరపెడితే షూటింగ్ ఆగిపోతుంది కాబట్టి కృష్ణ మీద గౌరవంతో ఆ డ్యాన్స్ చేయాల్సి వచ్చిందని సులోచన తన సన్నిహితులతో వాపోయిందట.
నాగభూషణం క్యారెక్టర్ ఒక రకంగా కన్యాశుల్కంలోని గిరీశం లాంటిది. ఏ ఎండకా గొడుగు అవసరం కొద్ది మారిపోతాడు. సినిమాలో ఎంతో మంది విలన్లు ఉన్నా అసలు విలన్ సాక్షి రంగారావే. అతని వల్లే కథ మొత్తం నడుస్తుంది.
ఈ 50 ఏళ్ల కాలంలో కృష్ణ, సత్యనారాయణ, కృష్ణ కుమారుడు రమేశ్ (బాల నటుడు) తప్ప , సినిమాలో నటించిన ప్రధాన నటులెవరూ జీవించిలేరు. నిక్కర్లు వేసుకుని చూసిన నాలాంటి ప్రేక్షకులు కూడా 60కి దగ్గర పడ్డారు. సినిమా ఇంకా యవ్వనంగానే ఉంది.
ఉక్కలో , బీడీల పొగలో చెమటకి తడుస్తూ ఒకరి మీద ఇంకొకరు కూర్చొని మా రాయదుర్గం ప్యాలెస్ థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం హైదరాబాద్ ఏసీ మాల్స్‌లో రిక్లయినర్ సోపాలో కాళ్లు చాపుకుని చూస్తున్నప్పుడు కూడా కలగలేదు.
ఆ రోజు బాల్యమనే నిధి ఉన్న షావుకారిని నేను
ఈ రోజు పేదవాన్ని
సంపద ఉన్నప్పుడు, అది సంపద అని తెలుసుకోలేం
అదే విషాదం