iDreamPost
android-app
ios-app

పేలిన ఫైబర్‌ నెట్‌ పుట్ట.. సాంబశివరావు అరెస్ట్‌.. వారంతా చిక్కుల్లో

పేలిన ఫైబర్‌ నెట్‌ పుట్ట.. సాంబశివరావు అరెస్ట్‌.. వారంతా చిక్కుల్లో

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఐఆర్ఎస్ అధికారి సాంబశివరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్ట్ చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 121 కోట్ల రూపాయిల అక్రమాలు జరిగినట్లు ప్రస్తుత ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన దీనికి సంబంధించి సిఐడికి ఫిర్యాదు చేశారు.. గౌతమ్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సిఐడి అధికారులు సుమారు ఐదు రోజుల నుంచి సాంబశివరావును విచారణ చేస్తున్నారు. సాంబశివరావు ఏపీ ఫైబర్ నెట్ లో ఎండీ హోదాలో ఉన్న సమయంలో టెరాసాఫ్ట్ అనే కంపెనీకి అక్రమంగా కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. ఎండి హోదాలో ఉన్న సాంబశివరావు టెరాసాఫ్ట్ సంస్థకు అక్రమంగా కాంట్రాక్టు కట్టబెట్టారని ఆ సమయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేయగా అర్హత లేకపోయినప్పటికీ సదరు కాంట్రాక్టు టెరాసాఫ్ట్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని సీఐడీ విచారణలో తేలింది.

టెరాసాఫ్ట్ సంస్థ ముందు బ్లాక్ లిస్టులో ఉంది కానీ సాంబశివరావు ప్రోద్బలంతో కేవలం ఒకే ఒక్క రోజులో దానిని బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించి టెండర్లు కట్టబెట్టారని సిఐడి తేల్చింది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ 2015లో ఇన్‌క్యాప్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీ) ద్వారా ఈ -టెండర్లు పిలుస్తూ టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే గడువు ముగియడానికి ఒక్క రోజు ముందు జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్‌ సంస్థ టెండర్‌ దాఖలు చేయకపోవడమే అందుకు కారణంగా సీఐడీ గుర్తించింది. అయితే టెండర్ దక్కించుకున్న ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్‌ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, టెండర్‌ నిబంధనలను పాటించకపోయినా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బిల్లులు చెల్లించారు.

అయితే ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, తదితర పరిణామాలతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ నిగ్గు తేల్చింది. అయితే ఈ కేసులో దాదాపు 19 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు కాగా సాంబశివరావు A2గా ఉన్నారు. ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాంబశివరావుకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆయనను విజయవాడ సిఐడి కోర్టులో హాజరు పరిచే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చి మరీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కి ఎండీగా చేరారు. అయితే తాజాగా కోట్ల రూపాయల అవినీతి నిజమేనని తేలడంతో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో పంచాయతీరాజ్- ఐటీ కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్న లోకేష్ టీంకి కూడా ఇందులో ప్రమేయం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని కూడా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read : గోదాట్లో కలిసిన బుచ్చయ్య పెద్దరికం..!