ఆధునిక యుగంలో ఉన్నామన్న మాటే కానీ మూఢనమ్మకాలు మాత్రం ప్రజలు విశ్వసించడం మానడం లేదు.. తాజాగా మూఢ నమ్మకంతో కన్న కూతురిని బలి ఇవ్వడానికి వెనుకాడలేదు ఒక కసాయి తండ్రి..
వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలో పుదుకొట్టే జిల్లాలో ఉండే గంధర్వ కోట పురాతనమైన కోటలకు ప్రసిద్ధి.. ఆ ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది.. దాంతో అనేకమంది ఆ ప్రాంతంలో రహస్యంగా తవ్వకాలు చేపడతారు. గుప్తనిధుల కోసం అదే ప్రాంతంలో ఉంటున్న పన్నీర్ సెల్వం కూడా కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుప్తనిధులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఒక మంత్రగాడి సహాయం కూడా తీసుకున్నాడు.
కాగా గుప్తనిధులు దక్కాలి అంటే తన మూడో కుమార్తెను బలి ఇస్తే నిధులు దక్కడంతో పాటుగా తనకు కుమారుడు జన్మిస్తాడన్న మంత్రగాడి మాటలు నమ్మి కుమార్తె అని కనికరం లేకుండా నరబలి ఇచ్చాడు..స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పన్నీర్ సెల్వం తన కుమార్తెను ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారని పదే పదే అనడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దానికి తోడు పోస్టుమార్టం రిపోర్ట్ లో అత్యాచారం జరగలేదని తెలియడంతో ఆ కసాయి తండ్రిని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో గుప్తనిధుల కోసం కుమార్తెను బలి ఇచ్చామని మంత్రగాడి మాటలు నమ్మి మోసపోయానని వెల్లడించాడు. దీంతో సదరు మంత్రగాడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇలాంటి నేరాలు గతంలో ఇంకేమైనా చేసారేమో అన్న కోణంలో విచారణ చేపట్టారు..