iDreamPost
android-app
ios-app

తండ్రీ కొడుకుల కాంబినేషన్ సాధ్యమేనా

  • Published Nov 19, 2020 | 7:23 AM Updated Updated Nov 19, 2020 | 7:23 AM
తండ్రీ కొడుకుల కాంబినేషన్ సాధ్యమేనా

గత మూడు నాలుగు రోజులుగా నాగార్జున-అఖిల్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకుడిగా ఓ భారీ మల్టీ స్టారర్ కు ప్లానింగ్ జరుగుతోందనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇదెంత వరకు నిజమో కానీ అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలని తెగ కోరుకుంటున్నారు. వాస్తవానికి అనిల్ రావిపూడి ఎఫ్3 స్క్రిప్ట్ మీదే ఇంత కాలం వర్క్ చేస్తూ వచ్చాడు. అక్కడ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కూడా ఈ సీక్వెల్ మీద ఆసక్తిగా ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక వెంటనే మొదలుపెడదామని చెప్పారట. అందుకే ఆలస్యమవుతోందని ఇన్ సైడ్ టాక్. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కొత్తగా ఉంది.

ఇండస్ట్రీ వచ్చి అయిదేళ్ళు అవుతున్నా అఖిల్ ఇప్పటిదాకా కనీసం యావరేజ్ బోణీ కూడా కొట్టలేదు. విడుదలైన మూడూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ని నమ్ముకుందామా అంటే ప్రమోషన్ చూస్తుంటే ఫాన్సే భయపడుతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి అవుట్ అఫ్ ది ఫామ్ డైరెక్టర్ ని నమ్ముకుని గీత ఆర్ట్స్ సంస్థ ఇంత సాహసం చేస్తోందంటే కంటెంట్ మీద గట్టి నమ్మకమే ఉన్నట్టుంది. అది విడుదలయ్యాక తేలుతుంది కానీ సురేందర్ రెడ్డి ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ మూవీ మాత్రం షూటింగ్ మొదలుకాకుండానే అంచనాలు ఓ రేంజ్ లో పెంచేసింది.

ఇదంతా ఎలా ఉన్నా నాగార్జున అఖిల్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మంచిదే కానీ అది కార్యరూపం దాల్చాలి. గతంలో అక్కినేని ఫామిలీలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు ఏమంత గొప్ప ఫలితాలు ఇవ్వలేదు. ఏఎన్ఆర్-నాగ్ కలిసి చేసిన వాటిలో కలెక్టర్ గారి అబ్బాయి హిట్ అనిపించుకోగా ఇద్దరు ఇద్దరే, అగ్నిపుత్రుడు ఫ్లాప్ అయ్యాయి. నాగార్జున సుమంత్ కలిసి నటించిన స్నేహమంటే ఇదేరా ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ చైతుల బంగార్రాజు రెండు సంవత్సరాల నుంచి మొదలుకాకుండా మీనమేషాలు లెక్కపెడుతోంది. మరి ఇన్ని నెగటివ్ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయడానికైనా ఈ కాంబో సెట్ అవ్వాలి మరి