నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొదలైన రైతు ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. మూడు నెలలకు పైగా పంజాబు, హర్యానా రైతాంగం చేస్తున్న ఆందోళనలు ఛలో ఢిల్లీ కార్యక్రమంతో కీలక దశకు చేరుకున్నాయి. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు రైతులు. ప్రభుత్వం మెట్టుదిగకపోవడంతో తమ పోరాటాన్ని బహుళజాతి సంస్థలపైకి మళ్లించారు రైతులు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రయోజనం పొందనున్న అంబానీ, ఆదానీ గ్రూప్‌ల బహిష్కరణకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.
వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాధించిన సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. మొదటి నుంచీ తాము డిమాండ్ చేస్తున్న వ్యవసాయ చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాధననూ అంగీకరించమని తేల్చి చెప్పాయి. కార్పోరేట్ కంపెనీల కనుసన్నల్లో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం వాటి ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, ప్రభుత్వానికి రైతులతో చర్చలు జరపడం ఇష్టం లేదని ప్రకటించాయి. ఇప్పటికే ఐదు దఫాల చర్చలు విఫలు కావడం, ఆరో దఫా చర్చలకూ ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రైతు సంఘాలు తమ ఆందోళనలను దేశ వ్యాప్తంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు 16 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు తమ పోరాటాన్ని ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలపైకి మళ్లించాయి.
రిలయన్స్ మాల్స్ ను బహిష్కరించాలని, రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్ని ఉత్పత్తుల కొనుగోలును నిలిపివేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. జియో సిమ్ లను సైతం వియోగించవద్దని నిర్ణయించాయి. ఆరుగాలం కష్టపడ్డ రైతుకు కనీస మద్దతు ధర కరువై కంటనీరు పెడుతుంటే మధ్య దళారీ పాత్ర పోషిస్తున్న కార్పోరేట్ కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నాయి. భారీ కోల్డ్ స్టోరేజ్ గిడ్డింగులను నిర్మించుకొని రైతుల నుంచి పంటను వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలతో పూర్తిగా వ్యవసాయం కార్పోరేట్ల గుప్పిట్లోకి పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పోరాటాన్ని కార్పోరేట్ సంస్థలపైకి ఎక్కుపెట్టాయి రైతు సంఘాలు.
ఇప్పటికే అదానీ, అంబానీ గ్రూపులు దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. రిలయన్స్ మాల్స్ వచ్చిన కొత్తలో కోట్లాది మంది చిల్లర వ్యాపారస్తులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పుడు రైతాంగం పరిస్థితి కూడా అలాగే మారనుంది. అందుకే… అంబానీ, అదానీ గ్రూపుల బహిష్కరణ మార్గాన్ని ఎంచుకున్నాయి రైతు సంఘాలు. కాగా.. అదానీ గ్రూప్ రైతుల ఆరోపణల్ని ఖండించింది. తాము రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని, కేవలం ఎఫ్‌సీఐ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్వహణకే పరిమితమయ్యామని చెబుతోంది.
ప్రభుత్వం మళ్లీ మళ్లీ పాత మాటనే మాట్లాడుతుండడంతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి సిద్దమయ్యాయి రైతు సంఘాలు. డిసెంబర్ 12న ఢిల్లీ – జైపూర్ జాతీయ రహదారి, ఢిల్లీ – ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేను దిగ్భందిస్తామని ప్రకటించాయి. బీజేపీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ఘెరావ్ చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 14వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మొత్తానికి కార్పోరేట్ కంపెనీలను కాదని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే స్థితిలో కేంద్ర ప్రభుత్వం కనిపించడం లేదు. అదే సమయంలో రైతులు వ్యవసాయ చట్టాల రద్దు మినహా మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో రైతులు చేస్తున్న పోరాటానికి దేశ, విదేశాల నుంచి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. తాజాగా కార్పోరేట్లపై ఎక్కుపెట్టిన రైతు పోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.