iDreamPost
iDreamPost
టాలీవుడ్ లోనే కాదు ఏ భాషలోనైనా సినీ వారసత్వం సహజం. కొందరు సక్సెస్ కొట్టి తండ్రుల పేరు నిలబెడితే మరికొందరు దశాబ్దాలు గడిచినా నాన్న స్థాయిలో సగం కూడా చేరలేక ఈదుతూ ఉంటారు. బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి వాళ్ళను మొదటి క్యాటగిరీలో వేస్తే అభిషేక్ బచ్చన్ లాంటి హీరోలు రెండో బ్యాచులోకి వస్తారు. వీటి పట్ల అభిమానులు చూపించే ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ఏకంగా పెదనాన్న కృష్ణంరాజు అందుకోలేని రేంజ్ కు చేరుకొని మరీ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం చూస్తున్నాం. ఈ ఎంట్రీలు ప్రవాహాలు ఆగేవి కాదు కానీ ఇప్పుడు అందరి కన్ను రెండు డెబ్యూల మీద గట్టిగా ఉంది.
అందులో మొదటిది బాలకృష్ణ ఏకైన వారసుడు మోక్షజ్ఞ సినిమా. అదుగో ఇదుగో అంటున్నారే తప్ప ఫలానా టైంలో ఫలానా దర్శకుడితో కొడుకుని లాంచ్ చేస్తానని బాలయ్య ఇప్పటికీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఆ మధ్య సాయి కొర్రపాటి నిర్మాతగా రానే వచ్చాడు మా రామయ్య అనే టైటిల్ లో ఓ కథ అనుకున్నారు కానీ అది ముందుకు కదల్లేదు. అసలు మోక్షజ్ఞకి నిజంగా నటన మీద ఆసక్తి ఉందా లేదా అనే అనుమానాలు కూడా పలు సందర్భాల్లో కలిగాయి. నందమూరి కుటుంబం నుంచి ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే పెద్ద స్థాయికి వెళ్ళాడు. అతని అన్నయ్య కళ్యాణ్ రామ్ తో సహా అందరూ మీడియం రేంజ్ దగ్గరే ఆగిపోయారు
ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తున్నాడు. నిన్న తన లేడీ మ్యూజిక్ టీచర్, నాన్న పవన్ తో కలిసి దిగిన ఫోటో చాలా వైరల్ అయ్యింది. తండ్రి కంటే చాలా పొడుగ్గా ఉండటం మీద మీమ్స్ కూడా వచ్చాయి. రేణు దేశాయ్ తో పవన్ విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లలు ఇద్దరు నాన్నతో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. అకీరా డెబ్యూ మీద పవన్ రేణు ఇద్దరికీ ఆసక్తి ఉంది. ఇంకో రెండు మూడేళ్ళ తర్వాతైనా ఎంట్రీ ఖాయమే అనుకోవచ్చు. కాకపోతే ఫలానా సంవత్సరం అని చెప్పలేం. సో రాబోయే కాలంలో స్టార్ కిడ్స్ గా మోక్షజ్ఞ, అకీరా ఎలాంటి ఎంట్రీలు ఇస్తారో చూడాలి