iDreamPost
android-app
ios-app

Ap government – అప్పులు- అభివృద్ధి- అసలు నిజాలు

  • Published Nov 13, 2021 | 9:13 AM Updated Updated Nov 13, 2021 | 9:13 AM
Ap government – అప్పులు- అభివృద్ధి- అసలు నిజాలు

ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అప్పులున్న దేశం ఏదీ.. పోనీ అభివృద్ధిలో ముందున్న దేశం ఏదీ.. రెండింటికీ సమాధానం అమెరికానే అని మీకు తెలుసా. ఆర్థికంగా బలమున్న దేశం అయినప్పటికీ అమెరికా ప్రభుత్వానికి అప్పులేమిటా అని ఆశ్చర్యపోతున్నారా.. అయినా నిజం ఏమంటే అమెరికా వివిధ సంస్థలు, దేశాల నుంచి భారీగా అప్పులు చేసి అభివృద్ధి సాధించింది. అప్పుల్లోనూ, అభివృద్ధిలోనూ ముందడుగు వేసింది.

పోనీ మన దేశంలో అప్పులు ఎక్కువగా రాష్ట్రం ఏదో తెలుసా.. ఆర్థిక రాజధానిగా భావించే ముంబై కేంద్రంగా ఉన్న మహారాష్ట్రకే అప్పులెక్కువ, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తక్కువేం కాదు. బెంగాల్, కేరళ కూడా తీసిపోలేదు. తమిళనాడు, తెలంగాణాలకు అప్పులు భారీగానే ఉన్నాయి. విభజన సమయంలో రూ. 61 వేల కోట్ల అప్పులతో ఉన్న తెలంగాణా ఇప్పుడు ఏకంగా రూ. 3.9 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న సంగతి తెలుసా. అంటే బంగారు తెలంగాణాగా చెప్పుకునే రాష్ట్రం కూడా ఏడున్నరేళ్లలో ఏకంగా 3.3 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏడాదికి రూ. 50వేల కోట్లు చొప్పున అప్పులు తెచ్చినట్టు ఆర్థిక శాఖ అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అప్పులు వేగంగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా సహా వివిధ కారణాలతో ఆదాయం పడిపోయింది. పైగా చంద్రబాబు హయంలో చేసిన అప్పులకు వడ్డీల భారం తోడయ్యింది. అంటే ఆదాయం లేకపోగా, వడ్డీల భారం, ప్రభుత్వ నిర్వహణ కోసం అనివార్యంగా అప్పులు చేస్తూ గడపాల్సి వస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వ అప్పులు దాదాపు రూ. 5లక్షల కోట్లు దాటిపోయాయి. విభజన నాటికి అవి లక్ష కోట్లుగా ఉండేవి. ఏడేళ్లలో నాలుగు లక్షల కోట్లకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది.

Also Read : Sajjala, Prasanth Reddy, Harish Rao – మా మీద ఏడుపు ఎందుకు: తెలంగాణకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్

అప్పులు చేసి పప్పు బెల్లాల్లా పథకాలకు పంచేస్తున్నారన్నది ప్రతిపక్షాల అభియోగం. చంద్రబాబు హయంలో చేసిన అప్పులన్నీ ప్రచారానికి, అమరావతి పేరుతో చేసిన ఆడంబరాలకు సరిపోయింది. కొత్తగా వచ్చిన ప్రాజెక్టు గానీ, భారీ పరిశ్రమలు గానీ భూతద్దం పెట్టి వెదికినా కనిపించలేదు. కానీ జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే 13 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకుంది. మూడు పోర్టులకు డీపీఆర్ లు సిద్ధం చేసి పనులు ప్రారంభించే దశకు వచ్చింది. జెట్టీల నిర్మాణం సాగుతోంది. గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్కులు, ఆర్బీకేలు, సచివాలయాల సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి తెచ్చింది. నాడు-నేడుతో స్కూళ్లను తీర్చిదిద్దింది. ఇదంతా అభివృద్ధికి సంకేతాలు. అదే సమయంలో కొత్త పరిశ్రమల స్థాపన కోసం ప్రయత్నిస్తోంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీని రంగంలోకి తెస్తోంది.పోలవరం నీటిని నిల్వ చేసే స్థితికి వచ్చింది. వెలిగొండ వచ్చే సీజన్ లో నీటిని తరలించబోతోంది. వివాదాలు లేకుంటే రాయలసీమ లిఫ్ట్ తో సుస్థిర నీటి వసతి జరిగేది.

గత ప్రభుత్వ పాలనలో అప్పులను అవినీతి కోసం, ఆడంబరాల కోసం వాడుకుంటే ఏపీలో ప్రస్తుతం దానికి భిన్నంగా పరిస్థితి ఉంది. అప్పులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించే ప్రయత్నం జరుగుతోంది. రాజధాని పేరుతో కొందరి లాభాలకు, వారి భూముల విలువ పెంచే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కాకుండా వాడవాడలా ప్రభుత్వ భవనాల నిర్మాణం ద్వారా ప్రజా సంపద పెంచే ప్రయత్నం జరుగుతోంది. దానిని విస్మరించి, జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఓ సెక్షన్ విస్తృతంగా ప్రయత్నిస్తోంది. వాస్తవాలకు మసిపూసి జనాలను మభ్యపెట్టాలని చూస్తోంది. కానీ ఒకనాడు తమ ఊరిలో ఒక పంచాయితీ ఆఫీసు కూడా లేని దశ నుంచి ఇప్పుడు ప్రతీ ఊరిలో నాలుగైదు ప్రభుత్వ ఆఫీసులు, పది , పదిహేను మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్న విషయం అనుభవంలో అందరికీ ఇట్టే అర్థమవుతుంది. అందుకే అప్పుల గోల ఎలా ఉన్నా తమకు ఏదో జరుగుతోందనే అభిప్రాయం జనంలో ఉంది.

అప్పులు లేకుండా వర్తమాన వ్యవస్థలో పాలన కాదన్నది అమెరికా నుంచి ఆంద్రా వరకూ అందరి అనుభవం చెబుతోంది. అయితే ఆ అప్పులను వినియోగించే తీరు మీదే భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కొందరి కోసం కాకుండా అందరి కోసం పాలనా ఫలాలు అందించే ప్రయత్నంలో అడుగులు వేస్తోంది. ఈలోగా గగ్గోలు పెడుతూ, ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పించే వారి గోల తప్ప ఏమీ మిగలదని గుర్తించుకోవడం మంచిది.

Also Read : Assets Disputes, Pusapati Gajapathi Brothers – పూసపాటివారి నగల వివాదం.. కొత్త మధ్యవర్తి నియామకం