iDreamPost
android-app
ios-app

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి

  • Published Apr 29, 2022 | 10:55 AM Updated Updated Apr 29, 2022 | 11:52 AM
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు మృతి

మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు పాముల పుష్ప శ్రీవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మామగారైన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు (72) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. చంద్రశేఖర రాజు మృతదేహాన్ని స్వగ్రామమైన కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి కోటకు తరలించి.. అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి

గిరిజన రాజులైన శత్రుచర్ల కుటుంబీకులు మొదటినుంచి కాంగ్రెస్ తో ఉండేవారు. శత్రుచర్ల సోదరులుగా పేరొందిన విజయరామరాజు, చంద్రశేఖర రాజు కాంగ్రెస్ లో వైఎస్ కు గట్టి మద్దతుదారులుగా ఉండేవారు. 1989లో అప్పటి నాగురు నియోజకవర్గం నుంచి చంద్రశేఖర రాజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అన్న విజయరామరాజు 2004లో వైఎస్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏర్పడిన కురుపాం నియోజకవర్గం నుంచి చంద్రశేఖర రాజు తన మేనల్లుడు జనార్దన్ తాట్రాజ్ ను గెలిపించుకున్నారు. వైఎస్సార్సీపీ ఏర్పడిన తర్వాత చంద్రశేఖర రాజు జగన్ నాయకత్వానికి మద్దతుగా ఆ పార్టీలో చేరారు.

కోడలికి మామ వారసత్వం

కురుపాం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన చంద్రశేఖర రాజు కుటుంబం నుంచి ఆయన కోడలు పాముల పుష్ప శ్రీవాణి 2014 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. 2019లోనూ మళ్లీ విజయం సాధించి వైఎస్ జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇటీవలి వరకు కొనసాగారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రశేఖర రాజు కుమారుడు అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా, పలు ఇతర పార్టీ పదవులు నిర్వహించారు. చంద్రశేఖర రాజు మృతి పట్ల పలుపార్టీల నాయకులు, శ్రేయోభిలాషులు సంతాపం ప్రకటిస్తున్నారు.