iDreamPost
android-app
ios-app

లోకేష్‌ ముందు మాజీ మహిళా ఎమ్మెల్యే బలప్రదర్శన ఎందుకు చేశారు..?

  • Published Oct 01, 2021 | 1:14 PM Updated Updated Oct 01, 2021 | 1:14 PM
లోకేష్‌ ముందు మాజీ మహిళా ఎమ్మెల్యే బలప్రదర్శన ఎందుకు చేశారు..?

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతిని ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వర్గీయులు శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ ముందు బల ప్రదర్శన చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రోద్బలంతో నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలు గతనెలలో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు, లోక్‌ష్‌లకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అ

దే నెలలో పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితులతో మాట్లాడడానికి వచ్చిన లోక్‌ష్‌ను నియోజకవర్గ కన్వీనర్‌గా ఉన్న పెంకే శ్రీనివాసబాబు కలిసి పిల్లి అనంతలక్ష్మి దంపతుల తీరుపై ఫిర్యాదు చేశారు. కన్వీనర్‌గా ఉన్న తనకు ఆ దంపతులు సహకరించడం లేదని, వారు ఒంటెద్దు పోకడలతో క్యాడర్‌ను ఒక తాటిపై నడిపించడం కష్టమవుతోందని లోకేష్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో అనంతలక్ష్మి దంపతులు భారీగా నాయకులను వెంట బెట్టుకుని వెళ్లి తమ వాదనలు వినిపించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు  ఎమ్మెల్యే అనంతలక్ష్మి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం ఆమె పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజాసమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరించారు. కొంతమంది పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న విషయం వివరించారు. తమ వాదనలు లోకేష్‌ సావధానంగా విన్నారని, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతుల, మండల పార్టీనాయకుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని నాయకులు చెబుతున్నారు.

Also Read : మరో వివాదం రాజేస్తున్న జేసీ ప్రభాకర్

పదికార్లలో..

పిల్లి అనంతలక్ష్మి భర్త జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు దేవు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, కరప డీసీ మాజీ చైర్మన్‌ కోటగిరి మహేంద్ర తదితర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఏకంగా పదికార్లలో తమ వర్గంతో అనంతలక్ష్మి దంపతులు వెళ్లడం అక్కడ పార్టీలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితికి అద్దం పడుతోంది.

మూడు గ్రూపుల రాజకీయం

నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. చినరాజప్ప ప్రోత్సాహంతో శెట్టిబలిజ వర్గానికి చెందిన కొందరు అనంతలక్ష్మి దంపతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. దీనికితోడు కొత్తగా రెండు నెలల క్రితం కన్వీనర్‌ బాధ్యతలు చేపట్టిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పెంకే శ్రీనివాసబాబా తన వర్గాన్ని తయారు చేసుకొనే పనిలో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని అటు కాపు, అటు శెట్టిబలిజల్లోని కీలక నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ఈ మూడు వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. 

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 25 ఏళ్ల అనుభవం, మాజీ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్పకు అధిష్టానంలో మంచి పలుకుబడి ఉంది. ఆయన రూరల్‌లో పాగాకు ఒక పక్క ఎత్తులు వేస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలో పట్టున్న అనంతలక్ష్మి వర్గీయులు ఇప్పటికే బలంగా ఉన్నారు. కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకుంటూ తమ పట్టు నిలబెట్టుకొనే యత్నాలు చేస్తున్నారు. ఇక కన్వీనర్‌ శ్రీనివాసబాబా నారా లోకేష్‌తో యూఎస్‌లో తాను ఎంఎస్‌ చదివినప్పటి నుంచి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకొని బలపడాలని చూస్తున్నారు. ఇలా ఆధిపత్య పోరుతో కాకినాడ రూరల్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మూడుముక్కలాట సాగుతోంది.

Also Read : ఆదిరెడ్డి వర్గం బాబు ఎదుట బలప్రదర్శన ఎందుకు చేసింది ..?!