iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌లో చేరనున్న దయాకర్ రెడ్డి దంపతులు?

  • Published Jan 05, 2022 | 6:15 AM Updated Updated Jan 05, 2022 | 6:15 AM
కాంగ్రెస్‌లో చేరనున్న దయాకర్ రెడ్డి దంపతులు?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో తెలుగుదేశం శరవేగంగా పతనమైంది.చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు కొనసాగే అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసు భయంతో ఉన్నపళంగా హైదరాబాదు నుంచి అమరావతి రాజధాని అంటూ వచ్చేయడం తెలంగాణలో టీడీపీకి మరణశాసనం లిఖించాయి.ఎన్నికల్లో ఘోర పరాజయాలు..నాయకులు, కార్యకర్తల వలసలతో రాష్ట్రంలో టీడీపీ దాదాపు ఉనికి కోల్పోయింది.ప్రస్తుతం వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంత మంది నేతలే మిగిలారు. వారు కూడా వేరే దారులు వెతుక్కుంటున్నారు. దంపతులైన మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డిలు అదే ఆలోచనలో ఉన్నారు. వారిని కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

రెండు నియోజకవర్గాల్లో పట్టు

తెలంగాణలో పేరుకు టీడీపీ ఉన్నా క్యాడర్ లేని పార్టీగా మిగిలిపోయింది. ఒక్క అసెంబ్లీ స్థానమైనా గెలిచే పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకు ఎల్.రమణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కూడా టీఆర్ఎస్‌లోకి మారిపోయి ఇటీవలే ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. దాంతో బక్కని నర్సింహులును అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు.ఆయనకు పెద్ద పేరు లేదు.ఉన్న కొద్దిపాటి నేతల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొత్తకోట దయాకర్ రెడ్డి ఒకరు. తొలి నుంచి పార్టీలో ఉన్న ఆయన రాష్ట్రంలో పార్టీ ఉనికి కోల్పోయినా ఇంతకాలం పార్టీతోనే ఉన్నారు. మక్తల్,దేవరకద్ర నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నుంచి దయాకర్, దేవరకద్ర నుంచి ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.టీడీపీలోనే కొనసాగితే ఇక భవిష్యత్తు ఉండదని గుర్తించి పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.

రేవంత్ ప్రోద్బలం

పార్టీ మారాలన్న దయాకర్ రెడ్డి ఉద్దేశాన్ని పసిగట్టిన ఆయన మాజీ టీడీపీ సహచరుడు.. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి కొత్తకోట దంపతులను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మక్తల్,దేవరకద్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన నేతలు లేరు.అదే సమయంలో అధికార టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో దయాకర్ దంపతులను పార్టీలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.దయాకర్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా ఉన్నారు.అన్నీ కుదిరితే త్వరలోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు బ్యాచ్ కు భంగపాటు