iDreamPost
iDreamPost
అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్, అసైన్డ్ భూముల సేకరణ.. ఇతర నిర్ణయాల్లో అంతా తానై వ్యవహరించిన మాజీమంత్రి పొంగూరు నారాయణ ఎక్కడున్నారు?.. ఎందుకు బాహ్య ప్రపంచంలోకి రావడంలేదు?.. అమరావతి భూ కుంభకోణం కేసులో సీఐడీ విచారణ సందర్బంగా సీఆర్డీఏ మాజీ కమిషనర్, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ తన వాంగ్మూలంలో మాజీమంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారని చెప్పడంతో.. ఇప్పుడు నారాయణ ఉనికిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. చాలా కాలంగా సొంత జిల్లా నెల్లూరులో గానీ, హైద్రాబాదులో గానీ ఎవరికీ అందుబాటులో లేరు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా చెప్పలేకపోతున్నారు. గతంలో ఇదే అమరావతి భూ కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు నోటీసులు పంపినా ఆయన్నుంచి స్పందన లేదు.
సీఆర్డీఏలో అన్నీ ఆయనే
నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన నెల్లూరు జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ గురించి 2014కు ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశానికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఉత్తరాంధ్ర అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చారు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్యే కూడా కానీ నారాయణను చంద్రబాబు తన క్యాబినెట్లోకి తీసుకొని మున్సిపల్ శాఖ అప్పగించారు. రాష్ట్ర కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటించి.. సీఆర్డీఏ ఏర్పాటు చేసినప్పుడు.. దానికి చైర్మన్ గా నారాయణనే నియమించి.. సర్వాధికారాలు కట్టబెట్టారు. దాంతో సీఆర్డీఏ చట్టం రూపకల్పన, ల్యాండ్ పూలింగ్ అమలు, అసైన్డ్ భూముల సేకరణ వంటివన్నీ నారాయణ కనుసన్నల్లోనే జరిగాయి.
నెల్లూరులోనూ కీలకపాత్ర
అమరావతి ప్రాంతంలో చక్రం తిప్పిన మంత్రి నారాయణ.. అటు తన సొంత జిల్లా నెల్లూరులోనూ కీలకంగా వ్యవహరించారు. జిల్లాలో అభివృద్ధి పనులు, రాజకీయాలు అన్నీ ఆయన అదుపాజ్ఞల్లోనే ఉండేవి. మొత్తంగా చంద్రబాబు కోటరీ మెంబరుగా నారాయణ పేరు పడ్డారు. 2019 ఎన్నికల్లో తొలిసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ప్రజాబాహుళ్యానికి దూరమయ్యారు. రాజకీయంగానే కాకుండా మాములుగానైనా ఎవరికీ అందుబాటులో లేరు. గత రెండేళ్లలో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే కనిపించారు. కేసులకు భయపడి అజ్ఞాతవాసం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : మాజీమంత్రి నారాయణ మెడకు భూకుంభకోణం ఉచ్చు