iDreamPost
android-app
ios-app

పితాని మాజీ పీఎస్‌ అరెస్ట్‌.. కుమారుడు కోసం గాలిస్తున్న ఏసీబీ

పితాని మాజీ పీఎస్‌ అరెస్ట్‌.. కుమారుడు కోసం గాలిస్తున్న ఏసీబీ

రాష్ట్ర కార్మికశాఖ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకటసురేష్, ఆయన మాజీ సీఎస్‌ మురళిలు భయపడిన విధంగానే జరిగింది. ఈఎస్‌ఐ స్కాంలో తమ అరెస్ట్‌ తప్పదని భావించిన వారు ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ నిన్న గురువారం హైకోర్టు విచారించి, తీర్పు రిజర్వ్‌ చేసిన 24 గంటల్లోనే ఏసీబీ దూకుడు పెంచింది. ఈ రోజు పితాని మాజీ పీఎస్‌ మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో మున్సిపల్‌ విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.

మురళి అరెస్ట్‌ కావడంతో పితాని కుమారుడు పితాని వెంకట సురేష్‌ అప్రమత్తమయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతని కోసం గాలిస్తున్నారు. ఈఎస్‌ఐ స్కాంలో అప్పట్లో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్, పీఎస్‌ మురళీలు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెం నాయుడుతో సహా తాజా, మాజీ అధికారులను కూడా ఏసీబీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లోనే పితాని కుమారుడు, పీఎస్‌ను కూడా అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం సాగింది.

తన కుమారుడుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అచ్చెం నాయుడు అరెస్ట్‌ తర్వాత పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తాను పరారైనట్లు జరిగిన ప్రచారాన్ని రాజమహేంద్రవరంలో విలేకర్ల సమావేశం పెట్టి మరీ ఖండించారు. అంతే కాదు తాము ఏ తప్పు చేయలేదని, ఏసీబీ విచారణకు తాను, తన కుమారుడు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. అప్పట్లో ఇలా చెప్పిన పితాని.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం గమనార్హం.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతోనే ఈ స్కాంలో పితాని కుమారుడు, ఆయన మాజీ పీఎస్‌ మురళీల పాత్ర ఉందని అందరికీ అర్థం అయింది. తమపై కక్ష సాధింపుతోనే అరెస్ట్‌ చేయాలనుకుంటున్నారని వారు తమ బెయిల్‌పిటిషన్‌లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ఒక వేళ కక్ష సాధింపు అయితే అరెస్ట్‌ చేసినా.. న్యాయస్థానాల్లో తమ నిజాయతీని నిరూపించుకుని నిర్ధోషిగా బయటకు రావచ్చు. అప్పుడు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది. అలా కాకుండా అరెస్ట్‌ నుంచి తప్పించుకోవాలని చూడడం, తాజాగా ఏసీబీకి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం ద్వారా తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పితాని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఏసీబీ విచారణకు సహకరించేలా కుమారుడును వారికి అప్పచెబుతారా..? లేదా..? చూడాలి.