టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆ పార్టీకి షాక్ తగలింది. మాజీ మంత్రి కుతూహలమ్మ, ఆమె కుమారుడు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ హరికృష్ణ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనారోగ్య కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కుతుహలమ్మ ప్రకటించారు. ఇద్దరు నేతలు ఒకే సారి రాజీనామా లేఖలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఫ్యాక్స్ చేశారు. తమకు వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన కుతూహలమ్మ.. అనారోగ్య కారణాలతో నియోజవర్గంలో తిరగలేకనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
MBBS చదివి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖుల్లో కుతుహలమ్మ ఒకరు. కాంగ్రెస్ లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కుతూహలమ్మ చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా 1981లో ఎన్నికయ్యారు. 1985 నుంచి వేపంజేరి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఒకసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొత్తం ఐదు పర్యాయాలు శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. కుతుహలమ్మ డాక్టర్ కావడంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో వైద్యశాఖమంత్రిగా ఆమె పనిచేశారు. 2007లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా సేవలందించారు. గుమ్మడి కుతూహలమ్మ జన్మస్థలం ప్రకాశం జిల్లా కందుకూరు కాగా ఆమె డాక్టర్ మునిసిద్ధన్ ను 1976 వివాహం చేసుకున్నారు.
రాష్ట్ర విభజనాంతరం 2014లో టీడీపీలో చేరారు. అనారోగ్య కారణాలతో నియోజకవర్గంలో తిరగలేకనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె రాజకీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న ఆమె కుమారుడు హరికృష్ణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిలో నేతల రాజీనామాలు టీడీపీకి ఇబ్బందికరంగా మారతాయని భావిస్తున్నారు. అయితే పార్టీలో సరైన ప్రాధాన్యం లేకపోవడంతోనే ఆమె కుమారుడితో కలిసి పార్టీకి రాజీనామా చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది.
Also Read : Ex Minister DL-డీఎల్ ఏం ఆశిస్తున్నారు. రాజకీయ ప్రకటనల వెనుక అసలు లక్ష్యం అదేనా