iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌కు మాజీ సీఎం రాజీనామా.

  • Published Sep 28, 2021 | 9:29 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
కాంగ్రెస్‌కు మాజీ సీఎం రాజీనామా.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రెండు నెలల క్రితం రాహుల్ గాంధీ సన్నిహితుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరిపోయారు.పంజాబ్‌లో ఏకంగా సీఎం అమరీందర్‌ సింగ్‌నే మార్చాల్సి వచ్చింది. అయినా అక్కడ అసమ్మతి చల్లారలేదు. అమరీందర్ పార్టీతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూపై కక్షతో రగిలిపోతున్నారు. సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం గోవాలో మాజీ ముఖ్యమంత్రి ఫెలీరో, ఆయన అనుచరులు పార్టీని వీడారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

40 ఏళ్ల అనుబంధం

ల్యుజెన్హు ఫెలీరోకు కాంగ్రెస్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఏఐసీసీ సభ్యుడు కూడా. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి సన్నిహితుడు. 1979లో తొలిసారి గోవా శాసన సభలో అడుగుపెట్టిన ఫెలీరో 2007 నుంచి 2017 మధ్య తప్ప.. ఇప్పటివరకు ఎమ్మెల్యేగానే ఉన్నారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆయన.. మోదీతో పోరాడే శక్తి మమతా బెనర్జీకే ఉందన్నారు. ప్రస్తుతం నాలుగు కాంగ్రెస్‌లు ఉన్నాయని, ఇవన్నీ కలిస్తే తప్ప మోదీని ఎదుర్కోవడం కష్టమని వ్యాఖ్యానించారు. వీటిలో మమత కాంగ్రెస్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొందని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఆమె ఫార్ములా విజయవంతం అయ్యిందన్నారు. గోవాలో బలపడటానికి టీఎంసీ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేపట్టింది. మాజీ సీఎం ఫెలీరో చేరనుండటంతో పార్టీకి గట్టి పునాది ఏర్పడనుందని భావిస్తున్నారు.

కొడిగట్టిన దీపంలా కాంగ్రెస్

ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకొని కాంగ్రెస్ నానాటికీ చిక్కిపోతోంది. 2017 ఎన్నికల్లో 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌ 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 21 మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. ఇదే అదనుగా 13 సీట్లు సాధించిన బీజేపీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) , మరికొన్ని పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్ సభ్యులను లాక్కోవడం ప్రారంభించింది. మొదట ముగ్గురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరుకుంది. దాంతో కాంగ్రెస్ బలం 14కి తగ్గింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో 15కు పెరిగిన కాంగ్రెస్‌ను ఈసారి బీజేపీ భారీగా దెబ్బ కొట్టింది. ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలను ఫిరాయించి తమ పార్టీలో చేరేలా చేసింది. దాంతో బీజేపీ బలం 26కు పెరగ్గా కాంగ్రెస్ 5కి పడిపోయింది. తాజాగా ఫెలీరో రాజీనామాతో నాలుగుకు దిగజారింది. కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీతో తీవ్ర పోటీ తప్పని పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడుతున్న టీఎంసీ నుంచీ కాంగ్రెస్‌కు సవాల్ ఎదురుకానుంది.