సన్నని ముఖంతో మురికి బట్టలు ధరించి ఎడమ చేతిలో ఒక బ్యాగ్ తో నైటీ వేసుకుని రోజంతా డస్ట్ బీన్స్ చుట్టూ తిరిగే ఒక వృద్ధురాలు ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. ఆమె ఎవరో సాధారణ బిచ్చగత్తె అనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఆమె బావ ఒక మాజీ ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లు సీఎంగా వ్యవహరించిన బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా సోదరి ఇరా బసు.
ఇరా బసు ఇప్పుడు దయనీయ స్థితిలో ఫుట్‌పాత్‌లపై జీవిస్తూ రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఫుట్‌పాత్‌పై పడుకుని కాలం వెళ్ళదీస్తున్న ఆమెను చూసి జాలేసి వీధి వ్యాపారులే తమకు తోచింది పెడుతున్నారట. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన బారా బజార్ ఏరియా డన్‌లాప్ వీధుల్లో ఆమె కనిపించారు. వైరాలజీలో పీహెచ్‌డీ చేసిన ఆమె ఇంగ్లీషుతో పాటు బెంగాలీ కూడా స్పష్టంగా ఇప్పటికీ మాట్లాడగలుగుతున్నారు. ఆమె గతంలో పాఠశాల టీచర్ గా పని చేశారు. ఆమె 2009 వరకు ఖరదార్ ప్రియనాథ్ బాలికల పాఠశాలలో లైఫ్ సైన్స్ టీచర్‌గా పనిచేశారు.
అయితే మరో విషయం ఏమిటంటే బుద్ధదేవ్ భట్టాచార్య మరియు మీరా భట్టాచార్యతో తన సంబంధం గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడల్లా ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆమె టీచర్‌గా రిటైర్ అయ్యే నాటికి బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చింది, కొన్నాళ్లకే ఏమైందో గానీ ఆమె అకస్మాత్తుగా అక్కడ నుండి అదృశ్యమయింది. ఇలా బిచ్చగత్తెగా మారింది. ఇక ఇరాబసు ఇలా ఉన్నా ఆమె పాఠశాలలో చదువు నేర్చుకున్న పిల్లలు, అక్కడి ఉపాధ్యాయులు ఇప్పటికీ ఆమెను గౌరవిస్తారు. ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ కాళి చందా మాట్లాడుతూ ఇరాబసు ఇక్కడ బోధించేవారు.కొన్ని కారణాల వల్ల ఆమె పెన్షన్ పత్రాలను కూడా సమర్పించలేకపోయారు. కాబట్టి ఆమెకు పెన్షన్ కూడా రాలేదని పేర్కొంది.
ఇక కృష్ణకాళి చందా చెప్పిన వివరాల ప్రకరం అప్పటి ఆర్థిక మంత్రి అసిమ్ దాస్‌గుప్తా పాఠశాలకు వచ్చి ఆమె కోసం వెతికారట. అయితే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా హైలైట్ చేసింది.దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగి అంబులెన్స్‌లో ఆమెను కోల్‌కతా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజానికి ఒక్కసారి సీఎంగా పని చేస్తే తమ కుటుంబాలే కాక తమ తరువాత మూడు తరాలు కూర్చుని తినేలా సంపాదిస్తున్న నేటి రోజుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. బుద్ధదేవ్ భార్య కూడా రిటైర్డ్ టీచర్. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన భార్య టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పింది.