iDreamPost
android-app
ios-app

పరువు కాపాడండి: మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యర్ధన

పరువు కాపాడండి:  మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ అభ్యర్ధన

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర హోం శాఖ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖను కొట్టివేయాలని, ఈ కుంభకోణంలో తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని నిన్న సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ప్రభుత్వ మాజీ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌.. ఈ రోజు మరో పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌లో దమ్మాలపాటి శ్రీనివాస్‌ సీఆర్‌డీఏ పరిధిలో భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై పక్కా ఆధారాలతో ఈ రోజు ఏసీబీ కేసు నమోదు చేసింది. అతనితోపాటు మరో 12 మందిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. భూముల కొనుగోలుపై దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఏ విధంగా కుట్రపూరితంగా వ్యవహరించింది ఏసీబీ సవివరంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆయనపై ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది కూడా అందులో పేర్కొంది.

అయితే ఏసీబీ నమోదు చేసిన కేసులో తనపై వార్తలు ప్రచురణ, ప్రసారం చేయకుండా ఆపాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన పరువు, ప్రతిష్టకు భంగం కలగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.

అమరావతిలో ఏపీ రాజధాని ప్రకటించకముందే.. దమ్మాలపాటి శ్రీనివాస్‌ సీఆర్‌డీఏ పరిధిలో భూములు కొనుగోలు చేశారు. వాటిని తన మామ, బావమరిది పేరిటి ముందు రిజిస్ట్రేషన్‌ చేయించిన మాజీ ఏజీ.. ఆ తర్వాత 2015, 2016 ఏడాదుల్లో వాటిని తను, తన భార్య పేరిటి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఏసీబీ ప్రకటనలో తెలిపింది.

సీబీఐ విచారణ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ఏజీ దమ్మాలపాటి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినప్పుడే ఆయన తప్పు చేశాడన్న విషయం అందరికీ అర్థం అయింది. తప్పు చేయకపోతే విచారణ అంటే భయం ఎందుకనే ప్రశ్నలు రాజకీయ నేతలతోపాటు, ప్రజల నుంచి వస్తున్నాయి. అరెస్ట్‌ చేయకుండా ఆపాలని దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించడంతోనే అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆయన పాత్రను తనకు తానే ధృవీకరించుకున్నారు.

ఇప్పుడు ఏసీబీ నమోదు చేసిన కేసులో తనపై వార్తలు ప్రచురణ, ప్రసారం కాకుండా నిలువరించాలని లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం విడ్డూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో వార్తల వ్యాప్తిని అడ్డుకోవాలని చూడడం మాజీ ఏజీ అయిన దమ్మాలపాటికే సాధ్యం అయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.