iDreamPost
iDreamPost
ఒక పెద్ద స్టార్ హీరోని ఆయన వారసుడిని ఒకే సినిమాలో డీల్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానుల అంచనాలు అందుకోలేక దెబ్బ తినాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి కాంబినేషన్లు సెట్ చేసేటప్పుడు కథకులు దర్శకులు చాలా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ప్రతిసారి రిజల్ట్ పాజిటివ్ గా వస్తుందని చెప్పలేం. ఓ ఉదాహరణ చూద్దాం. 1990వ సంవత్సరం. అంతకు ముందు ఏడాది వచ్చిన ట్రెండ్ సెట్టర్ శివతో నాగార్జున ఇమేజ్ శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయింది. తర్వాత ఏ సినిమా వచ్చినా అంచనాలు ఆకాశాన్ని తాకడం మొదలయ్యింది. అందుకే ప్రేమ యుద్ధం, నేటి సిద్దార్థ తీవ్రంగా నిరాశపరిచాయి.
ఆ సమయంలోనే ఏఎన్ఆర్-నాగ్ ల కాంబోలో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది శివ నిర్మాతలకు. అప్పటికే తండ్రీకొడుకులు కలిసి చేసిన వాటిలో కలెక్టర్ గారి అబ్బాయి సూపర్ హిట్ కాగా అగ్నిపుత్రుడు యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఈసారి గట్టి బ్లాక్ బస్టర్ కొట్టాలని టార్గెట్ పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోస్-ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఇద్దరూ ఇద్దరే సినిమాకు శ్రీకారం చుట్టాయి. రమ్యకృష్ణ హీరోయిన్ గా, రాజ్ కోటి సంగీతం, పీఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణంలో భారీ బడ్జెట్ తో సినిమా స్కోప్ లో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే బిజినెస్ కూడా చాలా క్రేజీగా జరిగింది. బయ్యర్లు ఎగబడ్డారు.
న్యాయమూర్తి తండ్రికి, చిన్నతనంలోనే విలన్ కుట్ర వల్ల రౌడీగా పెరిగిన కొడుక్కి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర కథ. వినడానికి బాగానే ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ విషయంలో కొత్త ట్రెండ్ ని ఫాలో అవుదామని దర్శకులు కోదండరామిరెడ్డి చేసిన ప్రయోగం ఫలించలేదు. దెబ్బకు రేసీగా సాగాల్సిన స్క్రీన్ ప్లే నీరసంగా కదలడంతో ప్రేక్షకులకు ఇద్దరూ ఇద్దరే నచ్చలేదు. అందులోనూ ఏఎన్ఆర్ ని మంచివాడిగా, నాగ్ ని కొంతభాగం నెగటివ్ షేడ్ లో చూపించడం కూడా పండలేదు. గణేష్ పాత్రో సంభాషణలు సైతం సోసోగానే సాగాయి. ‘ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా’ అనే పాట ఒక్కటే సంగీతసాహిత్య పరంగా గొప్పగా నిలిచిపోయింది. ఇలా క్యాస్టింగ్, టీమ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయినా అసలు కంటెంట్ తేడా కొట్టడంతో ఇద్దరూ ఇద్దరే చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది