ప్రకృతి ఎంతో చిత్రమైనది.. కాలానికి అనుగుణంగా మార్పులకు గురవుతూ కొన్ని జీవులను అంతం చేస్తూ కొత్త జీవులను పుట్టిస్తూ సాగిపోతూ ఉంది. దాదాపు 25 కోట్ల సంవత్సరాల ముందు పుట్టి 6 కోట్ల సంవత్సరాల వరకూ ఈ భూ ప్రపంచాన్ని ఏలిన రాక్షస బల్లులు(డైనోసార్లు) ప్రకృతిలో సంభవించిన పెను మార్పుల కారణంగా కాల గర్భంలో కలిసిపోయాయి. తర్వాతి కాలంలో ఈ భూమిపై మనిషి పుట్టుక సంభవించింది. మనిషి రాకతో ప్రకృతి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. మనిషి అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో ఆవిష్కరణలతో ప్రకృతి మనుగడకు విఘాతం కలిగిస్తున్నాడు.
అనేక పరిశ్రమలను ఫ్యాక్టరీలను నిర్మించి ప్రకృతి వనరులను కలుషితం చేస్తున్నాడు. క్రమంగా పెరుగుతున్న జనాభా కారణంగా నిత్యావసరాల కోసం,వ్యవసాయం పేరుతో అడవులను యథేచ్ఛగా నరికేస్తూ భూమ్మీద బ్రతికే జీవరాశి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాడు. ఇప్పటికే జంతువుల కళేబరాలను తింటూ బ్రతికే రాబందుల ఉనికి కనిపించని పరిస్థితి ఏర్పడింది. అడవులను నరకడం మూలంగా అడవుల్లో బ్రతికే జింకలు, కుందేళ్లు,అడవి పందులు లాంటి జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో వాటి మాంసంపై ఆధారపడి బ్రతికే పులులు,సింహాలు, చిరుతలు లాంటి జీవులు ఆహారం లభించక అడవిని దాటి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.
ఇప్పటికే అంతరించిపోతున్న జీవుల జాబితాలో పులులు,సింహాలు,చిరుతలు,ఎలుగుబంట్లు జింకలు, రాబందులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాబందుల గురించి.. గత 30 సంవత్సరాల్లో రాబందుల సంఖ్య 4 కోట్ల నుండి 4 లక్షలకు పడిపోవడం చూస్తుంటే వాటి మనుగడ ఎంత ప్రమాదంలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఊరి చివర పశువు కళేబరాలు పీక్కుతింటూ కనిపించే రాబందులు ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబందుల గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
తెలుగు సినిమాల్లో హీరో ఎలివేషన్ కోసం నేను పులిని,సింహాన్ని,చిరుతను అంటూ గర్వంగా చెప్పుకోవడం ఎక్కువగా చూస్తూనే ఉంటాం..పులి,సింహం,చిరుత ఇలాంటి జీవులను ధైర్యానికి రాజసానికి ప్రతీకలుగా చెప్పుకుంటూ వాటితో పోల్చుకుని మురిసిపోయే వారికి తెలియాల్సిన విషయం అవి ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితిలో బ్రతుకుతున్నాయని. అడవికి రారాజుగా చెప్పుకునే సింహాల సంఖ్య భారత దేశం మొత్తంగా చూస్తే 674 కాగా పులుల సంఖ్య 2967 గా ఉంది. చిరుతల విషయానికి వస్తే 700 లోపే ఉండటం గమనించాల్సిన విషయం. ఖడ్గమృగాల సంఖ్య పెరగడం కాస్త సంతోషించాల్సిన విషయం.. 1905 లో 75 ఖడ్గ మృగాలు ఉండగా వాటి మనుగడకు ప్రమాదం ఏర్పడిందని గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టడంతో,2020లో వాటి సంఖ్య 3600 పైగా నమోదయింది.
ఒకప్పుడు అడవులకే పరిమితం అయిన సింహాలు, పులులు, చిరుతలు ఆహారం నీళ్లు దొరక్క గ్రామాలు పట్టణాల బాట పడుతున్నాయి. వీటికి ఒకప్పుడు పుష్కలంగా ఆహారం లభించేవి. కానీ మానవుల వల్ల అడవులు అంతరించి పోవడం,ప్రకృతి వనరులు కలుషితం కావడం,నదులు,కాలువలు సైతం ఎండిపోవడం తద్వారా జింకలు,కుందేళ్లు,అడవి పందులు మృత్యువాత పడటంతో ఆహారం దొరక్క అటవీ జీవులు జనావాసాల్లో అడుగుపెట్టి మనుషులపై దాడికి పాల్పడుతున్నాయి. దీనికి కారణం మనిషి ఆహార గొలుసును నాశనం చేయడమే. మారుతున్న కాలం పెరుగుతున్న పరిశ్రమల వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి,అతివృష్టి అనావృష్టి ఏర్పడటం వల్ల మిగిలి ఉన్న జీవుల ఉనికి తీవ్ర ప్రమాదంలో ఉంది.
భారత ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణార్థం చట్టాలు చేసి అభయారణ్యాల్లో వేటను నిషేధించింది. అయినా కొందరు చట్టవ్యతిరేకమైన వేటను కొనసాగిస్తూ అటవీ జీవులకు ముప్పుగా మారుతున్నారు. నీలగిరి కొండల్లో కనిపించే నీలగిరి తహ్ర్ మేకలను నిబంధనలకు విరుద్ధంగా వేటాడటం వలన వాటి సంఖ్య 2500కి పడిపోయింది. వీటితో పాటు కాశ్మీరీ రెడ్ స్టాగ్,బ్లాక్ బక్, ఖడ్గ మృగాల మనుగడ తీవ్ర ప్రమాదంలో పడింది. వీటి మాంసంలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయన్న నమ్మకంతో వాటిని విచక్షణా రహితంగా వేటాడటం మూలంగా వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అటవీ జీవుల పరిరక్షణకు అడవుల నరికివేతను అరికట్టి ప్రకృతి వనరుల కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత మనుషులపై ఉంది.
ఈ భూమి మనుషులకు మాత్రమే నివాసం కాదు. ఇతర జీవులకు కూడా నివాస స్థలమే. కానీ మనిషి తీసుకుంటున్న విపరీత చర్యల మూలంగా వాటి ఉనికి ప్రమాదంలో పడింది. క్రూర మృగాలుగా మారిన జనారణ్యంలోకి దారి తప్పిన జింకల్లా అటవీ జీవులు అడుగుపెడుతున్నాయి. వాటి సంరక్షణ బాధ్యత ప్రతీ మనిషిపై ఉంది. లేకుంటే అవి అంతరించిపోయిన తరువాత ఒకప్పుడు పులి,సింహం,చిరుత,జింక లాంటి జీవులు ఉండేవని పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. వాటి అవశేషాలను మ్యూజియంలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవులను నరికివేతను ఆపి,అటవీ జీవుల సంరక్షణ చేపట్టి జనారణ్యంలో చొరబడుతున్న అటవీ జీవులను వాటికి చెందిన అరణ్యాల్లో స్వేచ్ఛగా బ్రతకనిద్దాం.. వాటి ఉనికిని కాపాడుకుందాం..