మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ మాజీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ అధిష్టానంతో ఏర్పడిన బేధాభిప్రాయాల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. సంబంధిత పత్రాన్ని స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు.
ఆరు నెలల్లో ఉప ఎన్నిక..
ఈటల రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నికల జరగడం ఖాయమైంది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతోనే తాను రాజీనామా చేశానని ఈటల పేర్కొనడం విశేషం. జరగబోయే ఉప ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య అని అభివర్ణించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల యావత్ తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్నవని చెప్పిన ఈటల.. తన రాజకీయ లక్ష్యాన్ని చెప్పకనే చెప్పారు. హుజురాబాద్‌లో అభ్యర్థి ఎవరైనా.. కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగానే ఇకపై ఈటల రాజకీయాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, బీ ఫాం ఇచ్చింది టీఆర్‌ఎస్ అయినా.. గెలిపించింది హుజురాబాద్ ప్రజలంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ సహచరులను గిల్లుతున్న ఈటల..
రాజీనామా చేసిన సందర్భంగా ఈటల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మంత్రుల్లోని కొందరిని ఆత్మరక్షణలో పడేశాయి. ఇతర పార్టీల నుంచి గెలిచి రాజీనామా చేయకుండా టీఆర్‌ఎస్‌లో చేరి నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారంటూ ఈటల ఫైర్ అయ్యారు. 2014 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిలో కొందరు మంత్రులయ్యారు. 2018 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రా రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెకు తన కేబినెట్‌లో కేసీఆర్ స్థానం కల్పించారు. ఇప్పుడు నైతిక విలువలు పాటిస్తూ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తద్వారా కేసీఆర్ సాగించిన ఫిరాయింపు, అనైతిక రాజకీయాలను తెలంగాణ ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నారు ఈటల.
Also Read : రఘురామకృష్ణ రాజుపై వేటు పడుతుందా.. ?
18366