iDreamPost
android-app
ios-app

ఈటల రాజీనామా.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక

ఈటల రాజీనామా.. తెలంగాణలో మరో ఉప ఎన్నిక

దాదాపు రెండు నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న ఈటల రాజేందర్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవమానకరమైన రీతిలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల.. తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రోజు తన నివాసంలో అనుచరులతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఉప ఎన్నికకు సిద్ధమని స్పష్టం చేశారు. సొంత కూతుకు బీ ఫాం ఇచ్చినా.. ఓడిపోయారని, తాను ఎప్పుడూ ఓడిపోలేదని చెప్పారు. ఎమ్మెల్యేగా తన ఛరిష్మాతోనే గెలిచానని, పార్టీ బీ ఫాం ఇచ్చినంత మాత్రాన గెలవలేదనేలా పరోక్షంగా కేసీఆర్‌కు చరకలు అంటించారు.

గతాన్ని గుర్తు చేసుకుని..

రాజీనామా ప్రకటన సమయంలోనూ ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లో తన ప్రయాణాన్ని, ఆ పార్టీలో తాను ఎదుర్కొన్న అవమానాలను ఏకరువు పెట్టారు. కేసీఆర్‌కు తనకు గ్యాప్‌ ఇవాళ రాలేదని, ఐదేళ్ల క్రితమే వచ్చిందని చెప్పారు. కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా గేటు వద్దే ఆపేసేవారన్నారు. అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లిన కూడా గేటు వద్దే నిలిపేశారని విమర్శించారు. మంత్రి పదవితో బతకడం కన్నా.. ఆత్మగౌరవంతో బతకాలని నిర్ణయించుకున్నట్లు ఈటల చెప్పారు. రాత్రికి రాత్రే మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఫిర్యాదు చేస్తే.. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని, ఉరి శిక్ష పడ్ద వారికైనా చివరి కోరిక అడుగుతారని ఈటల వాపోయారు. హుజురాబాద్‌ ప్రజలు తనకు అండగా ఉన్నారని చెప్పారు. తన అనుచరులను వేధిస్తున్నారని విమర్శించారు.

తర్వాత ఏంటి..?

19 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ పార్టీలో పయనం, ఉద్యమ నేపథ్యం, ఎమ్మెల్యేగా బాధ్యతలు.. తెలంగాణ ఆవిర్భావం, తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, మలి ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రి.. భూ కబ్జా ఆరోపణలు.. శాఖల తొలగింపు, మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌.. తాజాగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామాతో టీఆర్‌ఎస్‌తో ఈటల సాగించిన సుదీర్ఘ పయనం ముగిసింది. ఇక ఈటల పయనం ఎలా సాగబోతోంది..? అనే దానిపైనే ఆసక్తి నెలకొంది. సొంతంగా పార్టీ ఏర్పాటు, ఇతర పార్టీలలో చేరడంపై చర్చలు సాగినా.. చివరకు ఈటల బీజేపీ గూటికి చేరడం దాదాపు ఖాయమైందనే వార్తలొస్తున్నాయి. ఇటీవల బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశం అయిన తర్వాతే ఈటల తాజా నిర్ణయం తీసుకోవం గమనార్హం. బీజేపీలో ఈటల చేరిక ఇక లాంఛనమే కానుంది. హుజురాబాద్‌లో ఉప ఎన్నికల అనివార్యమైంది. అత్యంత ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోయే ఈ ఉప ఎన్నికలను అటు టీఆర్‌ఎస్, ఇటు ఈటల ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల కన్నా.. హుజురాబాద్‌ ఉప ఎన్నికల అత్యంత ఆసక్తికరంగా సాగబోతోందని చెప్పవచ్చు.