iDreamPost
android-app
ios-app

క్లైమాక్స్ కు ఈట‌ల రాజీనామా క‌థ కానీ…

క్లైమాక్స్ కు ఈట‌ల రాజీనామా క‌థ కానీ…

మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పైనా, ప్ర‌భుత్వంపైనా పోరాటానికి నాంది ప‌లికిన ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కూ టీఆర్ఎస్ కు గానీ, ఆ పార్టీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యే ప‌ద‌వి కానీ రాజీనామా చేయ‌లేదు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపిన ఈట‌ల రేపు కీలక ప్రకటన చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. వాస్త‌వానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సమైన జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ భావించారు. అయితే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపేందుకు కొంత సమయం పట్టడంతో.. ఈ నెల 4న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

బీజేపీలో చేరిక ఆల‌స్యం

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ బీజేపీలో చేరేందుకు మ‌రి కొంత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీని వెనుక ప‌లు రాజ‌కీయ కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. రేపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్.. మరో వారం తరువాత ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీలో చేరికపై సముఖత వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల రాజేందర్.. ఆయనతో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీలో చేరితే తనకు లభించే ప్రాధాన్యత ఏంటనే అంశంపై కూడా ఆయన బీజేపీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం. అయితే ఎలాంటి కండీషన్లు లేకుండానే బీజేపీలో చేరాల‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతుండ‌గా, ఈట‌ల కొన్ని ష‌ర‌తులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణం చేత‌నే బీజేపీలో చేరిక ఆల‌స్యం కానుంది.

కార‌ణాలు ఇవే..

బీజేపీలో చేరిక ఆల‌స్యం కావ‌డానికి ప‌లు కార‌ణాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రో వారంలో ఈట‌ల త‌మ పార్టీలో చేర‌తార‌ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మాట‌ల ద్వారా తెలుస్తోంది. ఆయ‌న రాక‌తో పార్టీకి ప్ర‌యోజ‌నాల‌తో పాటు, కొంద‌రిలో అసంతృప్తులు ర‌గులుతున్నాయి.ఈట‌ల.. బీజేపీలోకి ట‌చ్‌లోకి వ‌చ్చాడ‌న్న వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బీజేపీ నేత పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈట‌ల వ‌స్తే.. పార్టీలో ప్ర‌కంప‌ణ‌లు త‌ప్ప‌వ‌ని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఆయ‌న‌ను అప్ప‌డి నుంచి పార్టీ బుజ్జ‌గిస్తూనే ఉంది. బండి సంజ‌య్ కూడా పెద్దిరెడ్డితో మాట్లాడారు. ఇప్పుడు తాజాగా గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, కండీష‌న్లు పెట్టి పార్టీలో చేర‌దామ‌నుకుంటే కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. ఎలాంటి కండీష‌న్లు లేకుండానే ఈట‌ల‌ను చేర్చుకోవాల‌ని అధిష్ఠానానికి చెబుతున్నారు. ఈట‌ల రాక‌తో ఉన్న‌ బీజేపీ నేత‌ల్లో అసంతృప్తి పెరిగితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని పార్టీ గ్ర‌హించింది. అందుకే ముందుగా అంద‌రితోనూ మాట్లాడిన త‌ర్వాతే ఈట‌ల చేరిక‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.