iDreamPost
android-app
ios-app

లాజిక్ తో ఈటల కౌంటర్లు

  • Published Aug 12, 2021 | 6:38 AM Updated Updated Aug 12, 2021 | 6:38 AM
లాజిక్ తో ఈటల కౌంటర్లు

హుజూరాబాద్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. హుజూరాబాద్ లో ఇప్పుడు హరీశ్ రావు ఎంట్రీతో ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. మొన్నటిదాకా ‘సానుభూతి’ రాజకీయం చేస్తూ వచ్చిన ఈటల రాజేందర్ ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. పోటీకి సిద్ధమా అంటూ కేసీఆర్, హరీశ్ రావుకు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు.. తనపై వస్తున్న విమర్శలకు లాజిక్ తో కౌంటర్లు ఇస్తున్నారు.

హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ ఇన్ చార్జ్ గా ఉన్న హరీశ్ రావు.. నిన్నమొన్నటి దాకా సిద్దిపేట నుంచే వ్యూహాలు రచించారు. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రకటన రాగానే.. హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. రెండు మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తన మాజీ సహచరుడు ఈటల రాజేందర్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే ఆయన విమర్శలకు ఈటల అంతే ధీటుగా బదులిచ్చారు. ఈటల రాజేందర్ది ఆత్మగౌరవ పోరాటం కాదని, ఆత్మవంచన అని హరీశ్రావు విమర్శిస్తే.. తాను రోషమున్న బిడ్డను కాబట్టే సీఎం కేసీఆర్ అవమానాలను, అరాచకాలను ఎదిరించి బయటికి వచ్చానని కౌంటర్ ఇచ్చారు.

ఈటల ఓటువేస్తే ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని హరీశ్ ప్రశ్నించారు. ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతారని, మంత్రిగా ఉండగా చేయలేని పనులను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి బదులిచ్చిన ఈటల.. ‘‘నేను గెలిస్తే ఏం చేస్తానని హరీశ్రావు అంటున్నారు. కానీ నేను రాజీనామా చేశాకే దళితబంధు పథకం వచ్చింది. ఏడేళ్లుగా రాని రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పుడు వచ్చాయి. రోడ్లు వేయిస్తున్నారు. వందల కోట్లు హుజూరాబాద్ కు వచ్చాయి. గెలవకముందే ఇవన్నీ చేయిస్తున్నా’’ అంటూ సూటిగా, లాజిక్ తో తిప్పికొట్టారు. తన వల్లే ప్రభుత్వం ఈ పనులున్నీ చేస్తోందని ఈటల చెప్పకనే చెప్పారు. ఒకరకంగా ఇది నిజం. ప్రజల్లో కూడా ఇదే భావన ఉంది.

ఇక తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపైనా గతంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ‘‘ఉన్నది నీ అధికారులే కదా. విచారణ జరిపించు’’ అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేవనెత్తారు. ‘‘గ్రామాల్లో వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయాలనుకుంటే అధికారులతో చేయించుకోవచ్చు. చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు అది. కానీ ఈ విషయాన్ని వక్రీకరించి, నేనేదో భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు చేశారు. నేను ఏ తప్పు చేయలేదు. కానీ నీచమైన ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. దీన్ని ఉపయోగించుకునేందుకు ఈటల కూడా అలానే మాట్లాడేవారు. తనను కేసీఆర్ అవమానించారని, మోసం చేశారని, పొమ్మనలేక పొగబెట్టారన్న రీతిలో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేసి అవమానించారంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ పాదయాత్ర మధ్యలో ఆగిపోవడం, హరీశ్ విమర్శలు పెంచడంతో రూటు మార్చారు. ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. ‘బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నాడు’ అని హరీశ్ రావు చెప్పినట్లుగానే ఆయన మాట తీరు ఉంటోంది. దమ్ముంటే తనతో పోటీకి రావాలంటూ కేసీఆర్, హరీశ్ రావునే సవాలు చేశారు. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషనే రాలేదు. పొలిటికల్ హీట్ ఇప్పుడే ఇంతలా ఉంటే.. బైపోల్ ప్రచారం మొదలైతే ఇంకేలా ఉంటుందో..!

Also Read : మాకో ‘బంధు’ కావాలంటున్న తెలంగాణ వర్గాలు