iDreamPost
android-app
ios-app

ఇసుక మాఫియా పై ఉక్కు పాదం – జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇసుక మాఫియా పై ఉక్కు పాదం – జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణ బిల్లు పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడేలా మంత్రి వర్గం నిర్ణయించింది.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. టీడీపీ ప్రజా ప్రతినిధులే ఇసుక రిచ్ లను తమ గుప్పెట్లో పెట్టుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అన్ని పత్రికల్లో, టివి ఛానళ్లలో కధనాలు వచ్చాయి. ఉచిత ఇసుక పేరుతొ టీడీపీ నేతలు సాగించిన దందాపై, నదుల లో ఇష్టారీతిన తవ్వకాలపై న్యాయస్థానాల్లో విచారణలు కూడా జరిగాయి. ఐనా టీడీపీ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు యధేచ్చగా ఇసుక దందాను కొనసాగించారు. అధికార యంత్రాంగం కూడా ఏమి చేయలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించడం చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు నిదర్శనంగా నిలిచింది.  

ఇసుక మాఫియా ను అణచివేసేందుకు జగన్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో రాష్ట్ర సరిహద్దుల్లోని చిన్నా, పెద్దా రహదారుల వద్ద చెక్ పోస్ట్ లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. నియోజక వర్గాల వారీగా ఇసుక ధరలు నిర్ణయించనున్నారు. ఎక్కడైనా అధిక ధరలకు ఇసుక విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.