Idream media
Idream media
ఈఎస్ఐ స్కాం దర్యాప్తు మళ్లీ ముమ్మరం అవుతోంది. తెలంగాణలో కదిలిన డొంకతో ఇప్పుడు ఏపీ వైపు అధికారుల దృష్టి మళ్లుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో నిందితులుగా భావిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఈడీ సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, దేవికారాణి కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బుర్ర ప్రమోద్‌రెడ్డి డొల్ల కంపెనీల వెనుక ఉన్న నేతల ప్రమేయంపై కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. నగలు, ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్టు అనుమానిస్తున్నారు. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులను అటాచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ కేసుల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఏపీలో కూడా స్కాం ను వెలుగు తీసే పనిలో ఈడీ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఈడీ చేసిన రైడ్స్ లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ స్కామ్ గుట్టు బయటపడిన నెలలు, సంవత్సరాలు గడుస్తున్న తర్వాత ఈడీ రైడ్స్ జరిగినా..ఇప్పటికీ వీటిల్లో నిందితులు ఇళ్లలో కోట్ల రూపాయల నగదు బయటకు వస్తోంది. ఇప్పటికే తమపై వచ్చిన ఆరోపణలు, నమోదవుతున్న కేసుల తర్వాత కూడా ఇళ్లలో వీరు కోట్ల రూపాయలను పెట్టుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈడీ రైడ్స్ లో నిందితుల ఇళ్లలో కోట్ల రూపాయల కరెన్సీతో పాటు వివిధ రకాల ఆస్తుల వివరాలు లభించాయట. టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు, నర్సింహారెడ్డి మాజీ సీఎస్, వారి సన్నిహితులు.. వీళ్లందరి ఇళ్లపై ఈడీ రైడ్స్ జరిగాయి.
మరి తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధీకుల ఇళ్లలోనే ఇలాంటి రైడ్స్ జరిగాయి. అది కూడా ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈడీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. మరి ఏపీలో ఈ వ్యవహారం గుంభనంగా మారిపోయింది. ఏపీలో కూడా వందల కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కామ్ జరిగిందని ఏసీబీ ధ్రువీకరించింది. ఈ వ్యవహారంలో నాటి మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు కూడా జరిగింది. అయితే నెలల పాటు అరెస్టు అయినా అచ్చెన్నాయుడు అనుకూలుర హాస్పిటల్ లో సేదతీరారు. బెయిల్ వచ్చే వరకూ డిశ్చార్జి కూడా కాలేదు. అలా బెయిల్ రాగానే డిశ్చార్జి అయ్యారు. ఇలా వందల కోట్ల రూపాయల స్కామ్ లో నిందితుడు బైలుపై బయటకు రావడంతో ఆ తర్వాత ఆ కథ కాస్త ఆగింది. తెలంగాణలో మళ్లీ ఈఎస్ఐ స్కామ్ డొంక కదిలిన నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రస్తావన మొదలైంది. మరి మున్ముందు ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.