ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో భోధన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేడు అమరావతి లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కీలక అంశంపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ నిర్ణయం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు అన్నింటి లోనూ 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో భోదన చేయనున్నారు.
వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి కి అమలు చేసిన తర్వాత ప్రతి ఏడాది ఒక్కొక్క తరగతి చొప్పున 7 నుంచి 10 వ తరగతి వరకు బోధనను ఇంగ్లీష్ లో జరిపేలా సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించారు. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలరని ప్రభుత్వం భావిస్తోంది. నాణ్యమైన విద్య ద్వారానే పేదరిక తగ్గుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం పై ప్రతి పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు మీడియంలో భోదన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. లేక పొతే తెలుగు భాష కనుమరుగవుతుందని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ప్రభుత్వం తిప్పికొడుతోంది. తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని, మిగతా సబ్జెక్ట్ లు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో భోదన జరుగుతుందని చెబుతోంది. ఉపాధి, ఉద్యోగాలకు అవసరమైన ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి కోర్సులు అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి వస్తుందని, ఆ కోర్సులు తెలుగు లో ఉండవని విద్యా నిపుణులు వివరిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మంత్రి వర్గ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభం కానుంది.