Idream media
Idream media
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూలం మూడు రాజధానులు అన్నఅభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్ ఆ ప్రకటన అనంతరం ఏపీపై ఇతర దేశాల దృష్టి సైతం పడింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా ఒక ఎత్తయితే.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఓ రకంగా మతిపోయిందని చెప్పొచ్చు.
మూడు రాజధానులపై చర్చలు పెరిగాక.. ఆ పార్టీ అధినేతకు అటు అంగీకరించలేక.. ఇటు వ్యతిరేకించలేక కొంత కాలం సందిగ్దంలో పడ్డారు. మూడు రాజధానులు అమలులోకి వస్తే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠ చిరస్థాయిలో నిలిచిపోతుందన్న అనుమానమో.., తన అనుయాయులతో అమరావతిలో కొనుగోలు చేసిన భూముల విలువల్లో తేడా వస్తుందన్న భయమో.. కానీ రైతులకు అన్యాయం జరుగుతుందన్న పేరుతో అమరావతి ఉద్యమం పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమానికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. కొన్ని గ్రామాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నీ మూడు రాజధానులను ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు కోర్టు కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
చంద్రబాబు చర్యలతో పార్టీలోనే అభిప్రాయ బేధాలు వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరమయ్యారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ పార్టీ వైభవం కన్నా.. చంద్రబాబు తన అనుయాయుల లాభాల కోసమే పోరాడుతున్నారన్న ఆరోపణలు సొంత ఎమ్మెల్యేల నుంచే ఎదుర్కోవడం ప్రారంభమైంది. అమరావతి ఉద్యమం వెనుక చంద్రబాబు ఉద్దేశాలను గమనిస్తున్న ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అమరావతి పరిసర ప్రాంతాలలోనే అనూహ్యంగా అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగా ఉద్యమం ప్రారంభమైంది. ఓ ఉద్యోగి ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీంతో ఉద్యోగ వర్గాల నుంచి కూడా మద్దతు పెరగడం మొదలైంది.
ఇప్పుడు తాజాగా ఉద్యోగ సంఘాలు కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తున్నాయి. మూడు రాజధానుల అంశంపై ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయానికి ఏపీఎన్జీఓ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మూడు రాజధానుల వలన అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని నమ్ముతున్నామన్నారు. పాలనా రాజధానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా మరోసారి ప్రకటించారు. ఇలా అన్ని వర్గాల నుంచీ మూడు రాజధానులకు మద్దతు పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోంది.