Idream media
Idream media
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే.. ఉద్యోగులందరూ అలర్ట్ అవుతారు. ఎవరికి వారు ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఎక్కడికక్కడ కోడ్ అమలుకు చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు అంటేనే ఆ ప్రాంతంలో వాతావరణం వేరుగా ఉంటుంది. ఉద్యోగులు నిశ్శబ్దంగా విధులు నెరవేరుస్తూ పోతారు. కానీ స్థానిక ఎన్నికల సైరన్ మోగిన వేళ నుంచీ ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలు చేసేది రాజకీయ నాయకులు కాదు.. ఉద్యోగులు. ఎన్నికలకు తాము దూరం అంటున్నారు. వాయిదా వేయండి.. ప్లీజ్ అని వేడుకుంటున్నారు. మా ప్రాణాలంటే లెక్కలేదా.. అని ఎస్ ఈసీని ప్రశ్నిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎందుకంత మొండిగా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు సమ్మెకు కూడా వెనుకాడబోమంటూ హెచ్చరికలు జారీ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణాలేంటి..? అని ఆరా తీస్తే కచ్చితంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలే అని మెజార్టీ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచీ ఎస్ ఈసీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇటు రాజకీయ వర్గాలతో పాటు.. అటు ఉద్యోగ వర్గాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాములాంటిదని, ఇటువంటి పరిస్థితుల్లో వాయిదా వేయాలని ప్రతి ఒక్కరూ కోరుతూనే ఉన్నారు. అయినప్పటికీ నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపారు. చివరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో ఏపీలో వాతావరణం వేడెక్కింది. సాధారణంగా నోటిఫికేషన్ వెలువడగానే రాజకీయ వాతావరణం వేడెక్కాలి. కానీ ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది. ఓ వైపు కరోనా కేసుల నమోదు ఆగకపోవడం.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం వంటి కారణాల వల్ల ఎన్నికలంటే వారిలో గుబులు మొదలైంది. దీంతో అటు ఎస్ ఈసీతో పాటు, ఇటు సీఎస్ ను కూడా కలిసి తమ ఇబ్బందులను వివరించారు. న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సీఎస్ కూడా ఎన్నికల వాయిదా కోరుతూ నిమ్మగడ్డకు లేఖ రాశారు. ఆయన ఖాతరు చేయలేదు. పైగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. ఆగ్రహానికి కారణమయ్యాయి.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ ఎన్నికలకు సహకరించాలని.. లేదంటే తర్వాత తలెత్తే పరిణామాలకు వారు బాధ్యత వహించాలంటూ.. బెదిరించినట్లుగా వేళ్లను చూపుతూ మాట్లాడడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సరికాదని పేర్కొంటున్నాయి. పరుష పదజాలంతో ఉద్యోగులందరినీ నిమ్మగడ్డ హెచ్చరించడం బాధ కలిగించిందని, ఆయన వ్యక్తిగత లక్ష్యం కోసం మా ప్రాణాలు పణంగా పెట్టాలా..? అని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. ఎంత మందిని సస్పెండ్ చేస్తారో చేసుకోండి.. తాము మాత్రం ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని కుండబద్దలు గొట్టినట్లు చెప్పారు. అవసరమైతే సమ్మెకు సిద్ధమని ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని భావిస్తున్న ఉద్యోగులు దాని కోసం సమ్మెకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎస్ ఈసీ కి ఈ పరిస్థితి ఎదురవ్వడానికి నిమ్మగడ్డ వ్యవహార శైలే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నిజంగానే ఉద్యోగులు సమ్మెకు దిగితే.. స్థానిక ఎన్నికల నిర్వహణ ఎలా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే జరిగితే ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపో్నున్నాయి.