iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం కారణంగా ఉద్యోగులు వెతలు పాలయ్యారు. ఒకటో తారీఖున రావాల్సిన వేతనాలు మొదటి వారాంతానికి దక్కని స్థితిని ఎదుర్కొన్నారు. కేవలం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుని అడ్డుకోవడంతో ఏర్పడిన ఇలాంటి పరిస్థితికి చంద్రబాబు, టీడీపీ కారణమని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మండలిలో చేసిన ప్రయత్నాలతో రాష్ట్రమంతా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
మండలిలో ద్రవ్యబిల్లు ఆమోదం తెలుపకపోయినా 14 రోజుల్లో అది ఆమోదం పొందుతుందనే విషయం తెలిసి కూడా తెలుగుదేశం వ్యవహరించిన తీరు కారణంగా ఇతర వర్గాలకు కూడా కొంత సమస్య అయ్యింది. ముఖ్యంగా ప్రభుత్వ బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు సతమతం అయ్యారు. ఈ ఏడాది పూర్తి బడ్జెట్ ఆమోదం పొందగానే జూలై మొదటి వారంలో పలువురి బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాంతో చంద్రబాబు హయం నుంచీ పెండింగ్ లో బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆశాభావంతో ఉన్న దశలో మండలిలో పరిణామాలు వారిని నిరాశ పరిచాయి. అదనంగా వారం రోజుల పాటు ఎదురుచూడక తప్పని పరిస్థితిని తెచ్చిపెట్టాయి.
జూన్ 17న మండలి వాయిదా పడగా జూలై 1 నాటితో 14 రోజుల గడువు ముగిసింది. 2 వతేదీన దానికి అనుగుణంగా బిల్లు సిద్ధం చేసి గవర్నర్ కి పంపించి ఆమోదం పొందారు. 3,4 తారీఖుల్లో వేతనాల విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు. చివరకు ఐదో తేదీ సెలవు కావడంతో 6,7 తేదీల్లో అందరి అకౌంట్లలో వేతనాలు జమయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కాంట్రాక్టర్లలో కొన్ని పెండింగ్ బిల్లులకు కూడా మోక్షం కలగబోతోంది. ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇలాంటి జాప్యం జరగడమే అందరినీ చికాకు పెడుతోంది. మొదటి వారంలో వివిధ కార్యకలాపాలకు సంబంధించి ఆర్థికంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న వారికి సమస్యగా తయారయ్యింది. ప్రతిపక్షం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం తప్పు కాదని, కానీ రాష్ట్రంలోని 4.5లక్షల మంది ఉద్యోగులు మరో లక్ష మందికి పైగా పెన్షన్ దారులతో పరిహాసం ఆడే విధంగా ప్రవర్తించడం తగదని అంతా చెబుతున్నారు. ఏపీ లో గత 50 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి తొలిసారిగా ఎదుర్కొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడుతున్నారు.