iDreamPost
iDreamPost
క్రూరత్వం ఓ ఏనుగుని హతం చేసింది. గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు తీసేందుకు సిద్దపడడం అందరినీ కలచివేస్తోంది. మలబారు తీరంలో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. కేరళలో నీలంబూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నీటిలో చిక్కుపడిపోయిన ఒక ఏనుగు ఆహారం కోసం ఎదురుచూస్తుండగా, పేలుడు పదార్థాలతో నింపిన అనాసపండు తినిపించి దాని ప్రాణాలు తీసినట్టు చెబుతున్నారు. మృతి చెందిన ఏనుగు వయసు సుమారు14-15 సంవత్సరాలని నిర్ధారించారు. పైగా ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్టు కేరళ అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
వెల్లియార్ నదిలో మూడు రోజులు క్రితం ఈ ఘటన జరిగింది. ఆకలితో అనాసపండు ఆరగించేందుకు చేసిన ప్రయత్నంలో అది నోటిలోనే పేలడం ఏనుగు ప్రాణాలు పోవడానికి కారణంగా మారింది. ఏనుగు దవడల రెండు వైపులా బాగా గాయాలై దాని దంతాలన్నీ ఊడిపోయినట్టు చెబుతున్నారు. ఆ ఏనుగు మే 25వ తేదీన దగ్గరలోని అడవుల్లోకి ఆహారం కోసం వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ క్రమంలోనే నీటిలో ప్రమాదవశాత్తు చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. కడుపులో బిడ్డ కూడా ఉండడంతో ఆహారం కోసం ప్రయత్నించినట్టుగా భావిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ టీం కి చెందిన మోహన్ కృష్ణన్ అనే అటవీ శాఖ అధికారి రాసిన ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా నీటిలోనే చిక్కుకుపోయిన ఏనుగును రక్షించటానికి అటవీశాఖ ప్రయత్నాలు ఫలించలేదు.
దాని ప్రాణాలు కాపాడేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేసింది. నీటిలోంచి బయటకి తీసుకుని వచ్చి వైద్యం చేయడానికి రాపిడ్ రెస్పాన్స్ బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారికి సహాయం కోసం రెండు శిక్షణ పొందిన ఏనుగులని తెప్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యం అందేలోపు అది చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. మే 27 వ తేదీన నీటిలో ఉండగానే అది మరణించినట్లు అధికారులు తెలిపారు. దానికి పోస్ట్ మోర్టమ్ నిర్వహిస్తున్నపుడు అది గర్భం తో ఉన్న విషయం బయటపడినట్లు చెప్పారు. ఘటనా స్థలంలోనే ఏనుగుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.
నీలంబూర్ అటవీ ప్రాంతంలో గతంలో కూడా ఏనుగుల వేట సాగినట్టు స్థానికులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఈ ఘటనపై స్పందించారు. కేరళ ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. మలప్పురం ప్రాంతంలో ప్రతీ 3 రోజులకు ఒక్కో ఏనుగుని చంపుతున్నారని ఆమె ఆరోపించారు. అయినా దానిని అదుపు చేయడంలో కేరళ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఏనుగు వధ వ్యవహారం వైరల్ కావడంతో కేరళ ప్రభుత్వం కూడా కదిలింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దీనికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించింది. నీలంబూర్ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు , స్థానికుల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరాటం సాగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ పంటలు కాపాడుకునేందుకు ఏనుగులు, ఇతర జంతువులను మట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే పేలుడు పథార్థాలు తినిపించి, ఏనుగును చంపడం ఇదే తొలిసారి కావడంంతో పెద్ద వివాదంగా మారుతోంది. ఇలాంటి క్రూర చర్యలను కఠినంగా అడ్డుకోవాలని అంతా కోరుతున్నారు. కేరళ ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు