iDreamPost
android-app
ios-app

కేరళ బీజేపీలో హైవే దోపిడీ కల్లోలం,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలగింపు?

  • Published Sep 27, 2021 | 7:32 AM Updated Updated Mar 11, 2022 | 10:40 PM
కేరళ బీజేపీలో హైవే దోపిడీ కల్లోలం,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తొలగింపు?

దేశాన్ని ఏలుతున్న బీజేపీకి కేరళలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం.. దానికి మించి ఆ ఎన్నికల సమయంలోనే జరిగిన హైవే దోపిడీ ఘటన మెడకు చుట్టుకుని బీజేపీలో ఇప్పటికీ కల్లోలం రేపుతున్నాయి. స్వయంగా ప్రధాని మోదీయే దీనిపై విచారణకు పార్టీపరంగా ప్రత్యేక కమిటీని వేయడం.. అది ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం పార్టీ శాఖనే ప్రక్షాళన చేయడానికి పూనుకోవడం రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇందులో భాగంగా సినీ నటుడు, ఎంపీ సురేష్ గోపీకి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అగ్రనేతలు ఫిక్స్ అయ్యారు.

ఎన్నికల నిధుల మల్లింపునకే దోపిడీ నాటకం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కేరళలో ఏప్రిల్ ఆరో తేదీన ఎన్నికలు జరిగాయి. పోలింగుకు సరిగ్గా మూడు రోజుల ముందు త్రిసూరు సమీపంలో కొడకర హైవేపై ఒక వాహనాన్ని కొందరు ఆపి రూ.3.50 కోట్లు దోపిడీ చేశారు. నాలుగు రోజుల తర్వాత అదే నెల ఏడో తేదీన షన్జీర్ షాంషూద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. దీనిపై కేరళ ప్రభుత్వం సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపిస్తోంది. దోపిడీకి గురైన సొమ్ము బీజేపీకి చెందిన ఎన్నికల నిధి అని తేలడంతో.. రాజకీయ రంగు పులుముకుంది. ఓట్ల కొనుగోలుకే బీజేపీ హవాలా మార్గంలో ఈ సొమ్ము తరలించిందని వామపక్షాలు, కాంగ్రెస్ దుమ్మెత్తిపోశాయి.

మరోవైపు ఆ రూ. 3.50 కోట్ల ఎన్నికల నిధిని దారిమళ్లించి స్వాహా చేసేందుకే బీజేపీ నేతలు దోపిడీ నాటకం ఆడారని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ కుమారుడు హరికృష్ణన్ తోపాటు రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి జి.గిరీష్, ప్రధాన కార్యదర్శి ఎం.గణేషులను ప్రశ్నించారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో బీజేపీ పరువు పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు సాధించి పట్టు పెంచుకోవాలని భావించిన బీజేపీ గత అసెంబ్లీలో ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోవడం, సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మెట్రోమాన్ ఈ.శ్రీధరన్ ఓడిపోవడంతో తలకొట్టేసినంత పనైంది.

Also Read : ఎన్నికలకు ఇక ఐదు నెలలే.. క్యాబినెట్ లో భారీ మార్పులు

ప్రధాని ప్రత్యేక కమిటీ

ఎన్నికల్లో ఓటమి, పార్టీ ఎన్నికల నిధి దోపిడీలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో.. కేరళ పార్టీపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. ఎన్నికల నిధుల పంపిణీ, పార్టీ నేతల ప్రమేయంపై వాస్తవాల నిర్ధారణకు పార్టీ సభ్యులుగా ఉన్న రిటైర్డ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించారు.

ప్రధానమంత్రి స్వయంగా ఒక రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా కమిటీని నియమించడం అసాధారణంగా భావిస్తున్నారు. మాజీ ఐఏఎస్ సి.వి.ఆనంద్ బోస్, మాజీ ఐపీఎస్ జాకబ్ థామస్, మెట్రోమాన్ శ్రీధరన్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పలువురు పార్టీ నాయకులను విచారించి నివేదికను మోదీ-షా ద్వయానికి సమర్పించింది.

ఎన్నికల నిధుల దోపిడీ వ్యవహారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ తోపాటు రాష్ట్ర శాఖలోని పలువురు నేతల ప్రమేయం ఉన్నట్లు దాదాపు నిర్ధారణ కావడంతో అధ్యక్షుడితో సహా మొత్తం రాష్ట్ర కార్యవర్గాన్నే మార్చేయాలని నిర్ణయించారు. సురేంద్రన్ స్థానంలో పార్టీ ఎంపీ, సినీనటుడు సురేష్ గోపీకి అధ్యక్ష పదవిని ఖరారు చేశారు. ఈ విషయాన్ని కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : వచ్చే నెలలో బ్రేకప్ ఖాయమా, యూపీ ఎన్నికల వరకూ ఆగుతారా