iDreamPost
iDreamPost
ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెరకు కొత్తేమి కాదు కానీ పల్లెటూరి నేపథ్యంలో వచ్చేవి మాత్రం తక్కువగా ఉంటాయి. ఇలాంటి సినిమాలు పండాలంటే చక్కని పాటలు, ఆకట్టుకునే పాత్రలు, అందమైన భావోద్వేగాలు చాలా అవసరం. దానికో మంచి ఉదాహరణే 1997లో వచ్చిన ఎగిరే పావురమా. అది దర్శకుడిగా ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో టైం. మధ్యలో ఫ్లాపులు ఉన్నా నెంబర్ వన్, యమలీల, శుభలగ్నం, మావిచిగురు, వినోదం లాంటి బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సమయం. కృష్ణతో సంప్రదాయం దారుణంగా దెబ్బతినడంతో మార్పు కోసం నిర్మాత స్రవంతి రవికిశోర్ తెచ్చిన ఓ రీమేక్ ప్రతిపాదన ఆయనకు బాగా నచ్చింది. అంతకు ముందు సంవత్సరం మలయాళంలో వచ్చిన సల్లాపం సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని చూశారు. ఇదే సరైన సబ్జెక్టు అనుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గానూ తనకు మంచి స్కోప్ ఇచ్చే సబ్జెక్టు కావడంతో చకచకా పనులు మొదలుపెట్టారు. శ్రీకాంత్, జెడి చక్రవర్తి హీరోలుగా కొత్తమ్మాయి లైలాను హీరోయిన్ గా పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి తను దుష్మన్ దునియాకా అనే హిందీ మూవీ ఒకటే చేసింది. మరుధూరి రాజాకు సంభాషణల బాధ్యతను అప్పగించారు. ఆస్థాన కెమెరా మెన్ శరత్ ఛాయాగ్రహణం తీసుకున్నారు. సపోర్టింగ్ క్యాస్ట్ గా సుహాసిని, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, చరణ్ రాజ్, బ్రహ్మానందం, బాబు మోహన్, శివాజీరాజా, గుండు హనుమంతరావు, కళ్ళు చిదంబరం లాంటి భారీ తారాగణాన్నే ఎంచుకున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా పూర్తయ్యింది. విడుదలకు ముందే టి సిరీస్ ద్వారా మార్కెట్ లోకి వచ్చిన ఆడియోకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది.
ఓ పల్లెటూరిలో ఉండే జ్యోతి(లైలా) అనే అమ్మాయికి దేవుడు గొప్ప గొంతునిస్తాడు. ఎప్పటికైనా అందరూ గుర్తించే సింగర్ కావాలన్నది ఆమె లక్ష్యం. తనకు కావాల్సినవి సమకూరుస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు రైల్వే గ్యాంగ్ మెన్ గా పనిచేసే మేనమామ శివ(జెడి). ఓ ప్రోగ్రాం కోసం అక్కడికి వచ్చిన బాలు అలియాస్ జూనియర్ బాలసుబ్రమణ్యం(శ్రీకాంత్)ని ప్రేమిస్తుంది జ్యోతి. అక్కడి నుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆఖరికి జ్యోతి బాలు ఎలా ఒక్కటయ్యారు అనేదే కథ. మంచి కథాబలానికి కృష్ణారెడ్డి టేకింగ్ తో పాటు పదే పదే వినాలనిపించే పాటలు తోడయ్యాయి. మాఘమాసం ఎప్పుడొస్తుందో, చిటపటచినుకుల తాళం, బ్రహ్మలు గురుబ్రహ్యలు సాంగ్స్ మెలోడీ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా వంకాయ కూర మీద సీతారామశాస్త్రి గారు రసాయన ఆహా ఏమి రుచి తినరా మైమరిచి ఓ గొప్ప ప్రయోగం. ఇలా ముక్కోణపు ప్రేమకథను మధురమైన సంగీతం తోడై ఎగిరే పావురమా చక్కని చిత్రంగా నిలిచిపోయింది