iDreamPost
iDreamPost
అందరికీ గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ హయంలో నిర్మిచిన పోలవరం కుడికాలువ ద్వారా పట్టిసీమ నీటిని తరలించే క్రమంలో చంద్రబాబు అండ్ కో గోదావరి నీటికి స్వాగతం పేరుతో చేసిన కార్యక్రమం..దానికి ఈనాడు ఇచ్చిన ప్రచారం. దాదాపు అర పేజీలో పెద్ద ఫోటో వేసి అదంతా చంద్రబాబు ఘనతేనన్నట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అదొక్కటే కాదు.. ఎక్కడ చిన్న శిలాఫలకం వేసినా దానిని హైలెట్ చేస్తూ మొదటి పేజీలో కవరేజ్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు పాలనలో చాలా అభివృద్ధి జరిగిపోతోందనే భ్రమలు పాఠకులను కల్పించడానికి చాలా ప్రయాస పడింది. కానీ అవేమీ జనాలు అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. పైగా సోషల్ మీడియా యుగంలో సామాన్యుడికి సైతం వాస్తవాలు చేరకుండా ఆపలేరన్నది గత ఎన్నికల ఫలితాల చాటిచెప్పాయి.
ఇక వర్తమానంలో కూడా ఈనాడు తీరు ఏమాత్రం మారలేదని స్పష్టంగా గోచరిస్తోంది. నిజానికి ఏపీలో ప్రభుత్వం ప్రతీ సందర్భంలోనూ ఆ పత్రికకు పెద్దమొత్తంలో ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఆ ప్రకటనల ఫలితంగానయినా దాని సమాచారం వార్త రూపంలో ఇవ్వడం ఎవరైనా చేసే పని. కానీ ఈనాడు దానికి విరుద్ధం. అందులోనూ తనకు గిట్టని పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇదే రీతిన వ్యవహరిస్తుందని నిరూపించుకుంది. ఏపీ చరిత్రలోనే తొలిసారిగా రూ. 7500 కోట్ల వ్యయంతో ఒకేసారిగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ పూనుకున్నారు. ఇది చరిత్ర.
ఇంతకాలం అభివృద్ధి లేదని కువిమర్శలకు పూనుకునే వారికి తను అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన స్వీట్ ఆన్సర్. మార్కాపురం, పెనుకొండ, పాడేరు, గురజాల వంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం ద్వారా వైద్యరంగం అభివృద్ధి పథంలో నడిపించేందుకు జగన్ చేస్తున్న కృషిని అంతా కొనియాడుతున్నారు. 2023 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒకటి రెండేళ్లు అటూ ఇటూగా అవి అందుబాటులోకి వచ్చినా సామాన్య, మధ్యతరగతి కి లభించే ఊరట అంతా ఇంతా కాదు. కరోనా విపత్తులో రాష్ట్రంలో మెడికల్ మౌలిక సదుపాయాల కొరత బయటపడింది. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలకు తోడుగా, హెల్త్ హబ్ లతో రాష్ట్రం దిశ, దశ మారబోతోందన్నది కాదనలేని వాస్తవం.
ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కథనాన్ని మొదటి పేజీలో ఇవ్వడానికి ఈనాడు యాజమాన్యానికి మనసొప్పలేదు. ఇంత పెనుమార్పులు రాష్ట్రంలో జరుగుతుంటే దానిని పాఠకులకు చేర్చడానికి సిద్ధంకాలేకపోయారు.
ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు అంశాన్ని హైలెట్ చేస్తూ రాష్ట్రంలో అభివృద్దిని కొత్త పుంతలు తొక్కిస్తూ, క్షేత్రస్థాయిలో మార్పులకు చేస్తున్న ప్రయత్నం విస్మరించారు. శంకుస్థాపన జరుగుతున్న విషయాన్ని మొదటి పేజీలో రాయడానికి సిద్ధపడని ఈనాడు, చివరకు అతి పెద్ద సంకల్పంతో అడుగులు వేసిన సందర్భాన్ని కూడా అందరికీ చేర్చడానికి నిరాకరించింది. కుక్క తోక వంకర మాదిరి తమ తీరు మారదని చాటుకుంది.
వివిధ వేదికల ద్వారా ఈ విషయం ప్రజలకు చేరకుండా నిలువరించడం ఈనాడు తరం కాదు. అయినప్పటికీ వాస్తవాన్ని విస్మరించడానికే ప్రాధాన్యతనివ్వడం వారి నైజం తేటతెల్లం చేస్తోంది. సాటి పచ్చ మీడియా ఓపక్క విషం జల్లే ప్రయత్నం చేస్తుండగా ఈనాడు మాత్రం విస్మరించడం ద్వారా పాఠకులను వంచించే పనికి పూనుకుంది. బహుశా ఇప్పుడంటే జనాలకు అర్థమవుతోంది గానీ ఇది వారికి అలవాటయిన పని అని అర్థం చేసుకోవాల్సిందే.