iDreamPost
android-app
ios-app

జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఈనాడు

జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఈనాడు

జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోందని అంటుంటారు. ఆ మాట నిజమేనని ప్రధాన పత్రికలు నిరూపిస్తున్నాయి. సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్‌ మీడియా తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతోంది. పాఠకుల చేత వార్తను చదివించేందుకు నానా కష్టాలు పడుతోంది. ఈ క్రమంలోనే జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. శీర్షిక(హెండింగ్‌)కు వార్తకు సంబంధం లేకుండా పత్రికలు వార్తలను ప్రచురిస్తున్నాయి. హెడ్డింగ్‌ ఆకర్షనీయంగా, సెన్షేనల్‌గా పెడితే వార్తను చదువుతారనే భావనలో ఈనాడు వంటి ప్రధాన పత్రిక కూడా ఆ కోవలో నడుస్తోంది.

ఈ రోజు శుక్రవారం ఈనాడు ప్రధాన సంచికలో ‘‘సీఎంకు నోటీసు’’ అంటూ నిన్న మూడు రాజధానుల అంశంపై యథాతథ స్థితిని మరో మూడు వారాలపాటు కొనసాగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇక్కడ ప్రధాన విషయం యథాతథ స్థితిని కొనసాగిచడం, దానిపై మూడు వారాల్లోగా ఇరువర్గాల అఫిడవిట్లు దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మూడు రాజధానులపై వచ్చె నెల 11వ తేదీ లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలపై అభ్యంతరం ఉంటే మూడు రాజధానులను వ్యతిరేకించే వారు అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు వచ్చే నెల 17వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. 21వ తేదీ నుంచి ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లను రోజువారీగా విచారించి త్వరితగతిన సమస్యకు పరిష్కారం చెబుతామని పేర్కొంది.

అయితే ఈ విషయాన్ని వార్తలో పెట్టిన ఈనాడు.. శీర్షిక మాత్రం సీఎంకు నోటీసు అంటూ పెట్టింది. అది చూసిన వారికి.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా సీఎంకు హైకోర్టు నోటీసు ఇచ్చిందనే అర్థం వచ్చేలా ఉంది. కానీ అసలు విషయం సీఎంతోపాటు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ. సీపీఎం పార్టీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చింది. మూడు రాజధానుల అంశంపై వీరు కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది.

Read Also : ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించే అధికారం రాష్ట్రాలదేనంటున్న సుప్రిం.. తర్వాత పరిణామాలేంటి..?

అంటే.. ఇక్కడ హైకోర్టు రాజకీయ పార్టీలతో సహా పాలకులకు కూడా నోటీసులు ఇవ్వడం వెనుక ఉద్దేశం మూడు రాజధానులపై వారి అభిప్రాయం కూడా తీసుకోవాలన్నదే. ఆయా వ్యక్తులు, పార్టీ అధ్యక్షులు తమ అభిప్రాయం ఇవ్వొచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. అందుకే ఆప్షనల్‌గా.. అఫిడవిట్‌ దాఖలు చేయాలనుకుంటే.. అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ ఈనాడు ఈ విషయం వదిలేసి.. సీఎంకు నోటీసులు అంటూ హెడ్డింగ్‌ పెట్టడం కొన్ని య్యూట్‌ ఛానెళ్లు వ్యూస్‌ కోసం చేసే చీప్‌ ట్రిక్స్‌ను గుర్తుకు తెచ్చిందని అంటున్నారు. వేకువజామునే లేచి ముగ్గు వేస్తున్న కూతురును చూసి ఆశ్చర్యపోయిన తండ్రి అంటే ఎవరు చూస్తారు. వేకువజామునే కూతురు చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయిన తండ్రి.. అని హెడ్డింగ్‌ పెడితే ఇరగబడి చూస్తారని ఓ సినిమాలో అన్నట్లుగా ఈనాడు కూడా ఈ తరహాలోనే రీడబులిటీ కోసం వ్యవహరించినట్లుగా విమర్శలొస్తున్నాయి.