iDreamPost
android-app
ios-app

వదంతులు నమ్మొద్దు..10 పరీక్షలపై విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ

వదంతులు నమ్మొద్దు..10 పరీక్షలపై విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న పరీక్ష షెడ్యూల్ తాము తయారు చేసింది కాదని, పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బి. రాజశేఖర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కమిషనర్ వీడియో ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థులను గందరగోళానికి గురి చేసి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ టైం టేబుల్ తయారు చేశారని పాఠశాల విద్యా కమిషనర్ చెప్పారు. ఇలాంటి ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి వదంతులు ప్రచారం జరిగాయని కమిషనర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 17వ తేదీతో మూడో విడత లాక్ డౌన్ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత తేదీలతో ఓ టైం టేబుల్ ప్రిపేర్ చేస్తున్న ఆకతాయిలు విద్యార్థులను గందరగోళం పరిచేలా పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రచారం చేస్తున్నారు.