iDreamPost
iDreamPost
సినీ సెలబ్రిటీల డ్రగ్స్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఈసారి సీన్ లోకి ఈడీ వచ్చింది. విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా తొలుత సినీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ని విచారణకు పిలిచింది. సుదీర్ఘంగా 10గం.ల పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. అందులో ముఖ్యంగా ఆఫ్రికాతో పూరీకి ఉన్న లావాదేవీల అంశం గురించి కూపీ లాగారు. ఆఫ్రికా దేశాలకు నగదు లావాదేవీలు జరపడం వెనుక మతలబు గురించి ఆరా తీశారు. అఫ్రికన్ల బ్యాంకు ఖాతాలకు పూరీనుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ కావడం వెనుక కారణాలను ప్రశ్నించారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.
నైజీరియా సహా పలు దేశాలకు చెందిన ముఠాలు హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు కేసుల్లో వారు పట్టుబడ్డారు కూడా. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్స్ కి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయిన తీరు పూరీ చుట్టూ అనుమానాలు పెంచుతోంది. అయితే పూరీ మాత్రం అవన్నీ పూర్తిగా సినీ వ్యవహారాలకు సంబంధించినవిగా సమాధానమివ్వడం విశేషం. సినిమా షూటింగ్ లకు సంబంధించి మాత్రమే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఈడీ మాత్రం మరిన్ని ప్రశ్నలు సంధించింది. ఏ సినిమా కోసం, ఎంత బదిలీ చేశారు, ఎప్పుడు జరిగిందీ ట్రాన్స్ ఫర్ అనే వివరాలను పూరీ తెలియజేయాలని అధికారులు ప్రశ్నలు సంధించారు. వాటిని అందించేందుకు కొంత సమయం ఇచ్చినప్పటికీ పలువురు డ్రగ్స్ సరఫరాదారుల ఫోటోలను కూడా పూరీకి చూపించి వారితో ఉన్న పరిచయాల గురించి కూడా సమాచారం తీసుకున్నారు.
డ్రగ్ పెడలర్ కెల్విన్ గురించి తెలుసా అంటూ ఈడీ ప్రశ్నించగా, తనకు తెలియదంటూ పూరీ సమాధానమిచ్చారు. 2017లో పట్టుబడిన కెల్విన్ కాల్ లిస్టు, వాట్సాప్ చాట్ ల ఆధారంగానే డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. అప్పట్లో టీఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ సాగించింది. అందులో 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. కానీ కేసు మాత్ర కొలిక్కి రాలేదు. ఈలోగా మనీ ల్యాండరింగ్ అంశం ముందుకు రావడంతో ఈడీ రంగంలో దిగింది. ఇప్పటికే కెల్విన్ తదితరులను విచారించిన ఈడీ.. ఆ 12 మందిని విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలోని బృందం పూరీని ప్రశ్నించింది. పూరీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు రెండు లావాదేవీల్లో భారీగా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. వాటి ఆధారాలను సేకరించింది. ఇద్దరు ఆఫ్రికన్ల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన ఆధారాలను కూడా పూరీ ముందు ఉంచడంతో ఆయన ఖంగుతినాల్సి వచ్చిందని సమాచారం. పూరీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లో ఆరేళ్ల లావాదేవీల వివరాలను ఈడీ కోరింది. దానికి అనుగుణంగా పూరీ చార్టెర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ వాటిని ఈడీ అధికారులకు అందజేశారు. తమ దగ్గరున్న బ్యాంకు ఖాతా వివరాలతో వాటిని పోలుస్తూ ఈడీ ప్రశ్నలు వేసింది.
ఇక పూరీ తర్వాత ఛార్మీ విచారణకు హాజరుకాబోతోంది. అయితే పూరీ విచారణ సమయంలో బండ్ల గణేష్ కూడా ఈడీ కార్యాలయానికి చేరుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. తాను మాత్రం పూరీ కోసమే వచ్చానని ఆయన చెప్పినప్పటికీ గతంలో పూరీతో రెండు చిత్రాలు నిర్మించిన నేపథ్యంలో బండ్ల గణేష్ ని కూడా ఈడీ పిలిచిందనే వాదన వినిపిస్తోంది.