ఎన్నికలంటేనే అభ్యర్థుల కోసం పార్టీల అన్వేషణ.. పార్టీల టికెట్ల కోసం నేతలు, ఆశావహుల ప్రయత్నాలతో చాలా హడావుడి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెడతాయి. పరిస్థితిని బట్టి నామినేషన్ల దాఖలు గడువు చివరి క్షణం వరకు ఇది కొనసాగుతుంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఆయన ఒకేసారి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. అదే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విధానం వేరేగా ఉంటుంది. చివరి క్షణం వరకు అభ్యర్థులను తేల్చకుండా నానబెట్టడం ఆయన స్టైల్. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) నేత మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
భారత రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలకు రెండేళ్ల ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27న కనీసం 140 స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని ఆయన వెల్లడించడం రాజకీయ రంగంలో కలకలం రేపుతోంది.
Also Read:కాకినాడ మేయర్ పై అవిశ్వాసం : బీజేపీది ఒకదారి.. ఆ పార్టీ కార్పొరేటర్లది మరో దారి
జేడీఎస్ మిషన్ 123
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. 2023లో జరిగే ఎన్నికల్లో కనీసం 123 స్థానాలు సాధించాలన్నది తమ పార్టీ లక్ష్యమని కుమారస్వామి 20 రోజుల క్రితమే వెల్లడించారు. దానికి మిషన్ 123 అని వ్యవహరిస్తున్నారు. ఆ లక్ష్య సాధనకు ఇప్పటినుంచే కార్యక్షేత్రంలోకి దూకాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఆ మేరకు 102 మంది అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పిన ఆయన.. తాజాగా 140 మందితో జాబితా సిద్ధం అయ్యిందని.. ఈ నెల 27న జాబితా ప్రకటిస్తామని వివరించారు. అభ్యర్థిత్వాలు ఖరారైన వారికి 28వ తేదీ నుంచి బిదాడిలోని తమ ఫారం హౌస్ లో ప్రజా సమస్యలపై స్పందించడం, గ్రామాల పర్యటన, తదితర అంశాల్లో అవగాహన కల్పిస్తారు. అనంతరం వారు ఈ రెండేళ్లు ప్రజల్లోనే ఉంటూ పార్టీ విధానాలు ప్రచారం చేయాలన్నది జేడీఎస్ కార్యాచరణగా కుమారస్వామి వివరించారు.
నేతలను బైండ్ చేయడానికేనా..
జేడీఎస్ నిర్ణయంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. జేడీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి విజయాలు సాధించలేదు. కొన్ని ప్రాంతాలు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి పట్టు కూడా లేదు. 2013లో 40 సీట్లు, 2018లో 37 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2018లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ కూడా మెజారిటీకి దూరంగా ఉండిపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడింది.
Also Read: అలా చేస్తే ఇరకాటంలో పడేది టీడీపీనే..!
అయితే బీజేపీ రాజకీయ వ్యూహాలతో 16 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దానికితోడు పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు తరచూ చేస్తున్న ప్రకటనలతో అప్రమత్తమైన కుమారస్వామి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా అభ్యర్థిత్వాల పేరుతో నేతలను కట్టిపడేయడం..
పూర్తిస్థాయి మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే
రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నారు.