కాకినాడ మేయర్ పై అవిశ్వాసం : బీజేపీది ఒకదారి.. ఆ పార్టీ కార్పొరేటర్లది మరో దారి

By Aditya Sep. 23, 2021, 06:30 pm IST
కాకినాడ మేయర్ పై అవిశ్వాసం : బీజేపీది ఒకదారి.. ఆ పార్టీ కార్పొరేటర్లది మరో దారి

కాకినాడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అక్టోబర్ 5న ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో తమ పార్టీ తటస్థంగా ఉంటుందని బీజేపీ నాయకులు ప్రకటించారు. అంతటితో ఆగకుండా పార్టీ ఆదేశాలు ఉల్లంఘించే కార్పొరేటర్ లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

అప్పుడు పొత్తు పట్టుకొని..

2017 కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. మొత్తం 50 స్థానాల్లో పంచాయతీల విలీనం విషయమై కోర్టులో కేసు నడుస్తుండటంతో 48 డివిజన్లకే ఎన్నికలు జరిగాయి. 38 సీట్లు టీడీపీ, 10 సీట్లు బీజేపీ సర్దుబాటు చేసుకుని పోటీ చేశాయి. వైఎస్సార్ సీపీ అన్ని స్థానాలకు పోటీ చేసింది. టీడీపీ 32, వైఎస్సార్ సీపీ 10, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3 చోట్ల గెలిచారు. అయితే ముగ్గురు సభ్యులు మృతి చెందగా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్ గా నియమితులైన రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు 44 మంది సభ్యులే ఉన్నారు.

ప్రస్తుతం పార్టీలకు అతీతంగా మేయర్ పై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్న వారు 33 మంది కాగా, అందులో టీడీపీ వారు 10 మంది ఉన్నారు. అందులో 9 మంది మాజీ ఎమ్మెల్యే కొండబాబు వర్గంగా ఉండగా మేయర్ ఒంటరి అయ్యారు. బీజేపీ తరఫున గెలిచిన ముగ్గురిలో ఇద్దరు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నారు. ఇదే బీజేపీ నేతల ప్రకటనకు కారణమైంది.

Also Read : కాకినాడ మేయర్ పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు

మిత్రపక్షం కవ్విస్తున్నా అంతేగా..

గడిచిన పరిషత్తు ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం జనసేన నాయకులు టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా తటస్థంగానే ఉన్నారు. అసలు ఎన్నికల్లో పోటీయే చేయడం లేదని చెప్పి జనసేనతో చీకటి ఒప్పందంతో టీడీపీ బరిలోకి దిగినప్పుడూ బీజేపీది తటస్థ వైఖరే. ఇప్పుడు కడియంలో ఎంపీపీ పీఠానికి టీడీపీతో జనసేన చేయి కలిపినా చూస్తూ ఊరుకోవడం తప్ప బీజేపీ చేస్తున్నదేమీలేదు.

రాష్ట్ర స్థాయిలో అదే వైఖరి..

తన మిత్రపక్షమైన జనసేన రాష్ట్ర స్థాయిలోనూ టీడీపీ రాజకీయాలకు కొనసాగింపు రాజకీయాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ ప్రకటన చేస్తే దాన్ని అంది పుచుకొని ప్రెస్ మీట్లలో ఆవేశ పడడం మినహా రాష్ట్రంలో బీజేపీని పటిష్ట పరచడానికి తీసుకుంటున్న చర్యలేమిలేవని కమలం పార్టీ అభిమానులు నేతలపై ఫైర్ అవుతున్నారు. కమ్యునిష్టులతో పొత్తు పెటాకులైన పార్టీలతో తాంబూలాలు తీసుకోవడం, వారిచ్చే సీట్లకోసం ఎదురు చూడటమే గానీ స్వతంత్రంగా ఎదగడానికి బిజెపి ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి.

అప్పటి నుంచి అదే స్థితిలో..

1998లో తూర్పుగోదావరిలోని కాకినాడ నుంచి సినీనటుడు కృష్ణంరాజు, రాజమండ్రిలో గిరజాల వెంకట స్వామి నాయుడుని లోక్ సభ సభ్యులుగా గెలిపించి అక్కడి జనం బీజేపీపై తమ అభిమానం చాటుకున్నా దాన్ని పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఇన్నాళ్ళూ ప్రయత్నం చేసినా ఆ స్థాయిలో మళ్లీ జిల్లాలో విజయాలు అందుకో లేకపోయింది. పార్టీపై అభిమానం ఉన్నవారు బీజేపీ స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటుంటే అందుకు భిన్నంగా నాయకులు అడుగులు వేయడమే నష్టం చేకూరుస్తోంది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని గట్టెక్కితే చాలు అని సరిపెట్టు కోవడం వల్ల ఓటుకి ఎక్కువ..నోటాకి తక్కువ అన్నట్టు మిగిలిపోయింది.

Also Read : భవిష్యత్తు లో ఎమ్మెల్యే సీట్ అని ఆశపడి ఉన్న మేయర్ సీట్ పొగొట్టుకున్న వైనం...

కాకినాడలో మెజారిటీ కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా మేయర్, డిప్యూటీ మేయర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా, సొంత పార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాలను గౌరవించకుండా క్రమశిక్షణ చర్యలు అంటూ స్టేట్మెంట్లు ఇస్తే ఉన్న కార్పొరేటర్లను కోల్పోవడం తప్ప ఒరిగే దేమీ వుండదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp