iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణీ కుల వివాదం ముగిసినట్టే కనిపిస్తోంది. అప్పీలేట్ అథారిటీ దానిపై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆమె ఎస్టీ కొండదొర కులానికి చెందిన మహిళగా నిర్ధారణ చేసింది. దాంతో ఆమె తండ్రి పాముల నారాయణమూర్తి ఎస్టీ కాదంటూ చేసిన అభియోగాలను విచారణ కమిటీ తోసిపుచ్చింది. రేగు ఉమామహేశ్వర రావు సహా పలువురు చేసిన ఫిర్యాదులపై తీర్పు వెలువడింది.
విజయనగరం జిల్లా కురుపాం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించి జగన్ క్యాబినెట్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ ఉపముఖ్యమంత్రిగా పుష్ప శ్రీవాణీ వ్యవహరిస్తున్నారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జన్మించారు. ఆ తర్వాత ఉపాధ్యాయశిక్షణ పొందారు. విజయనగరం కురుపాం కి చెందిన క్షత్రియ కుటుంబంలోని పరీక్షిత్ రాజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మెట్టినింట అడుగుపెట్టిన తర్వాత ఉపాధ్యాయవృత్తిని వీడి రాజకీయాల్లో ప్రవేశించారు. వరుసగా విజయం సాధిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ఎమ్మెల్యేగానూ, డిప్యూటీ సీఎంగానూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పేరు గడించారు.
ఆమె కులం రీత్యా ఎస్టీ కాదని ఏపీ హైకోర్టులో పిటీషన్ వేయడంతో దానిపై విచారణకు ఆదేశాలు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ విచారణ చేసింది. పాముల నారాయణ మూర్తి, పుష్ప శ్రీవాణీ సమర్పించిన ఆధారాలతో సంతృప్తి వ్యక్తం చేసింది. ఇరువురు ఎస్టీలేనని నిర్ధారించింది. దాంతో మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన అప్పీలేట్ అథారిటీ దానిని నిర్ధారిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఇకపై పుష్పశ్రీవాణీ కుల సర్టిఫికెట్ వ్యవహారంలో రాజేసిన వివాదం సమసిపోయినట్టేనని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న తీరు సహించలేక ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆమె కుటుంబం ఎస్టీ కొండదొరగా నిర్దారించిన నేపథ్యంలో ఇక ఈ వివాదాలకు చెక్ పడుతుందని ఆశిస్తున్నారు.