Idream media
Idream media
దుబ్బాక అసెంబ్లీకి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచే అన్ని పార్టీలూ దూకుడు పెంచాయి. ఇంకో నాలుగు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన, 19తేదీ ఉపసంహరణకు తుదిగడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ నియోజకవర్గంలో గెలుపును ప్రెస్టేజీగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ కొనసాగుతుండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేశారు.
బరిలో రామలింగారెడ్డి భార్య
దుబ్బాక ఉప ఎన్నిక అసెంబ్లీ నియోజకర్గానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారన్న కేసీఆర్ ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని కేసీఆర్ అన్నారు. రామ లింగా రెడ్డి కుటుంబం మొత్తం అటు ఉద్యమంలో అలానే ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన రామలింగారెడ్డి తల పెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసమని అన్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని కేసీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్ లో కొనసాగుతున్న సస్పెన్స్
కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వచ్చినప్పటికీ అనూహ్యంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డి భంగపడడంతో కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దల టికెట్ హామీ మేరకు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని స్థానిక నేతల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుండగా ఆయన చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనార్హం.