iDreamPost
android-app
ios-app

తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదంటున్న డీఎస్

  • Published Jul 17, 2021 | 1:47 AM Updated Updated Jul 17, 2021 | 1:47 AM
తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదంటున్న డీఎస్

రాజకీయాల్లో ఓడలు బండ్లు అవుతుంటాయి… బండ్లు ఓడలు అవుతుంటాయి.. అన్నీ కలిసి వస్తే అందలమెక్కే వాళ్లు ఉంటారు.. కాలం కలిసి రాక కనుమరుగైన వాళ్లు ఉంటారు. నిజామాబాద్ కు చెందిన కీలక నేత డీ శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇలాంటిదే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పిన ఆయన.. ప్రస్తుతం రాజకీయ తెరపైన కనిపించడం మానేసి చాలా కాలమైంది. తాజాగా తన పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తుండటంపై కాసింత వైరాగ్యంతో స్పందించారాయన. తన చిన్న కొడుకు బీజేపీ ఎంపీగా ఉండటం.. ఇప్పుడు పెద్ద కొడుకు కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో.. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని అన్నారాయన.

బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు..

శుక్రవారం రాత్రి నిజామాబాద్ లోని తన ఇంట్లో డీఎస్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ చాలా మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఎంపీల ఇళ్లల్లో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకులు వేరే పార్టీల్లో ఉండడం కొత్త విషయమేమీ కాదు’’ అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా తాను చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు.

చిన్న కొడుకు అర్వింద్ కష్టపడి ఎంపీగా గెలిచాడని, నిజామాబాద్ మేయర్‌గా పెద్ద కొడుకు సంజయ్ ఐదేళ్లు రిమార్క్ లేకుండా పని చేశాడని గుర్తు చేసుకున్నారు. తన ఇద్దరు కొడుకులు రెండు కళ్ల లాంటి వారని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదంటూ వ్యాఖ్యానించారు. తాను టీఆర్ఎస్‌లో ఉంటే కేసీఆరే చెప్పాలన్నారు. ఆ పార్టీలో కనీసం తన మంచి చెడుల గురించి అడిగే వాళ్లు కూడా లేరని వాపోయారు.

ఉమ్మడి ఏపీలో హవా..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ చీఫ్‌గా కీలక బాధ్యతల్లో పని చేశారు డీఎస్. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర మంత్రిగానూ పని చేశారు. కానీ వైఎస్ మరణంతో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతుండటంతో టీఆర్ఎస్ లోకి చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. కానీ తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండిపోయారు. ఒకానొక సమయంలో టీఆర్ఎస్ నుంచి డీఎస్ బహిష్కరిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ చేస్తే చేసుకోవచ్చు అన్నట్లుగా తేల్చి చెప్పేశారు. పార్టీలో తనకు మర్యద లేదని, కేసీఆర్ పలుమార్లు అవమానించారని వాపోయారాయన. టీఆర్ఎస్ ఉన్నా లేనట్లుగానే ఉంది ఆయన పరిస్థితి. అందుకే తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని వ్యాఖ్యానించారు.